సీఎం కేసీఆర్ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పలేకపోయారని.. హైదరాబాద్ అందాలు మాత్రం చూసి వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బీజేపీ బహిరంగ సభ చప్పగా సాగిందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేసామని ప్రధాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలని మంత్రి అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగడంలేదన్నారు.
ప్రధాని మోదీ ఊకదంపుడు ఉపన్యాసంతో ప్రజలకు శబ్ద కాలుష్యం తప్ప ఒరిగిందేమీలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన గురించి కానీ ప్రస్తావించలేదని విమర్శించారు. మోదీకి కేసీఆర్ చీకటి మిత్రుడని ఆరోపించారు. మోదీ మిత్ర ధర్మం ఎంత చక్కగా ఉందో చూశారా తెలంగాన మిత్రులారా అని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ భాయ్.. భాయ్ అని వ్యాఖ్యానించారు. విభజన హామీలపై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయలేదని అన్నారు.