భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. పెదఅమీరంలో సభావేదికపై అల్లూరి కుటుంబీకులను ప్రధాని సత్కరించారు. అనంతరం బహిరంగ సభలో..
‘తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా’ అంటూ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. యావత్ భారతదేశం తరపున అల్లూరి పాదాలకు నమస్కరిస్తున్నా. అంధ్రప్రదేశ్ త్యాగధనులకు నమస్కరిస్తున్నా. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. మనమంతా ఒకటే అనే భావనతో ఉద్యమం జరిగింది. వారిని స్మరించుకుంటూ ముందుకెళ్లాలి. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్, గిరిజన మ్యూజియం నిర్మిస్తాం’ అని ప్రధాని మోదీ అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇచ్చిన మాట ప్రకారం అల్లూరి 125వ జయంతి వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగు ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. ఈ ఏడాదంతా అల్లూరి పేరు మోగాలి. అల్లూరి నడయాడిన ప్రాంతాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఉత్సవాలు నిర్వహిస్తాం’ అని అన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణం. తెలుగు జాతికే కాకుండా, యావత్ దేశానికే అల్లూరి స్ఫూర్తిప్రదాత. ఆయన ఘనతను చాటిచెప్పేందుకే అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేశాం. అల్లూరి త్యాగం ప్రతి మనిషి గుండెలో చిరకాలం నిలిచిపోతుంది. తెలుగుగడ్డపై అల్లూరి పుట్టడం మనందరి అదృష్టం.
సభావేదికపై మోదీ, జగన్ లతో పాటు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తదితరులు ఆశీనులయ్యారు.