ప్రముఖ నటుడు, నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు అయిన అల్లు రామలింగయ్య వందవ జయంతి కార్యక్రమాలను అల్లు అరవింద్ మరియు కుటుంబ సభ్యులు గ్రాండ్ గా నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి రాత్రి వరకు పలు కార్యక్రమాలను నిర్వహించిన అల్లు కుటుంబ సభ్యులు రోజంతా కూడా సందడి చేశారు.
సాయంత్రం అల్లు రామలింగయ్య పై రాసిన పుస్తకమును ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారితో మొదటి పరిచయం మొదలుకొని ఆయన తనను ఇంటి అల్లుడుగా చేసుకునేందుకు చూసిన విధానం.. తనకు పెట్టిన పరీక్షల గురించి చాలా సరదాగా అందరిని నవ్వించే విధంగా కామెడీ టైమింగ్ తో చెప్పి చిరంజీవి తనదైన మార్క్ నవ్వులు పూయించారు.
మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ అధ్యంతం నవ్వులు పూయించింది. దాదాపు అరగంట పాటు సాగిన ఆయన స్పీచ్ ప్రతి ఒక్కరిని కూడా నవ్వించింది అనడంలో సందేహం లేదు. అల్లు రామలింగయ్య గారు ఒకసారి తనను పక్కన కూర్చోబెట్టుకొని తాగమంటూ మందు గ్లాసు చేతికి ఇవ్వబోయారని, ఆ సమయంలో తాను అబ్బే తాగను నేను హనుమంతుని భక్తుడిని అంటూ చెప్పగానే ఆయన నాకు పాజిటివ్ మార్కులు వేసేసుకున్నాడంటూ కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులతో మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ సాగింది.
మా నాన్న గారు చెప్పడంతో అల్లు రామలింగయ్య గారి ఇంటికి సురేఖ ను ఇష్టం లేకుండానే చూసేందుకు వెళ్లాను అని.. ఆ సమయంలో సురేఖ ను చూసి నో చెప్పలేక పోయాను. ఒక వైపు సినీ కెరీర్ గురించి ఆలోచన మరో వైపు సురేఖ ను చూసి నో చెప్పలేక పోయాను అంటూ చిరంజీవి చాలా నాటీగా కామెంట్స్ చేశాడు. చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో ఆయన భార్య సురేఖ సిగ్గుపడుతూ నవ్వుతూ మురిసిపోవడం చూడవచ్చు.
అలాగే అల్లు అర్జున్, ఇతర కుటుంబ సభ్యులు ఇంకా చిరంజీవి పిల్లలు అంతా కూడా ఆయన మాటలకు నవ్వుకున్నారు. అల్లు రామలింగయ్య గారితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చిన చిరంజీవి ఆయనతో నాకు ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని, మేమిద్దరం ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల ఆయన గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం నాకే దక్కిందని చిరంజీవి అన్నారు.
నవ్వుతూ నవ్విస్తూ ఎన్నో విషయాలను చిరంజీవి తన మామగారు అల్లు రామలింగయ్య గారి గురించి చెప్పి అందరిని మెప్పించారు. ప్రస్తుతం అల్ల రామలింగయ్య గారి గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ కామెడీ టైమింగ్ కి హ్యాట్సాఫ్ అంటూ చాలా మంది చాలా రకాలుగా మెగాస్టార్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.