ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం పవర్ ప్రాజెక్ట్ త్రీడీ మోడల్ నమూనాను పరిశీలించారు. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్ ద్వారా 5,410 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూలులో గ్రీన్ కో ఎనర్జీస్ సంస్థ హైడల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే తొలి హైడల్ పవర్ ప్రాజెక్టుకు ఏపీ వేదికవడం గర్వకారణమని అన్నారు. వచ్చే 5ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. 15 వేల కోట్లతో నిర్మించే ఈ పవర్ ప్రాజెక్టు నిర్మాణంలోనే 15వేల ఉద్యోగాలు రానున్నాయని అన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యాక 3వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం జగన్ అన్నారు.