డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.
బోల్డంత ఖర్చు చేసి, కేంద్రంపై పోరాటమంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబ గతంలో చేసిన దీక్షలు ఏమయ్యాయో చూశాం. ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంతలా సొమ్ములు వెదజల్లినా జనం వాటిల్ని లైట్ తీసుకున్నారు. నాలుగేళ్ళ పాలన తర్వాత చంద్రబాబు ఎదుర్కొన్న దుస్థితి అదే.
మూడేళ్ళకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన జనానికి మొహం మొత్తేసింది. జనంలోకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వెళుతోంటే, జనం బెదిరిపోతున్నారు. బలవంతంగా జనాన్ని వైఎస్ జగన్ బహిరంగ సభల కోసం అధికార పార్టీ నేతలు, అధికారులూ తరలిస్తున్నా, ఆయా వేదికల వద్ద కూర్చోడానికి జనం ససేమిరా అంటున్నారు.
‘అమ్మా.. బాబూ.. పది నిమిషాలన్నా కూర్చోండి.. కష్టపడి తీసుకొచ్చాం కదా.? డబ్బులిచ్చాం కదా.. తిండి కూడా పెడుతున్నాం కదా..’ అంటూ అధికార పార్టీ నేతలు, కొన్నిసార్లు పోలీసు సిబ్బంది కూడా బతిమాలుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిన్నటికి నిన్న ఏలూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం’ చేపట్టగా, అక్కడ కనిపించిన పరిస్థితిని చూసి వైసీపీ శ్రేణులే కంటతడి పెట్టడాల్సి రావడం గమనార్హం. ‘ప్లీజ్.. దయచేసి వెళ్ళిపోవద్దు..’ అంటూ పోలీస్ అధికారులు సైతం జనాన్ని బతిమాలుకున్నారు. ప్చ్.! జనం ఆగితే కదా.! కొందరైతే, ‘ఆ సోది మేం వినలేం..’ అంటూ లైట్ తీసుకున్నారు.
జనం పారిపోవడం మొదలైంది.. తదుపరి నాయకులే వైసీపీ నుంచి పారిపోయే పరిస్థితి రాబోతోంది. ఇక, అధికార పక్షం అధికారికంగా పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం లేదు.