2019 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణ జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నాడు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ కి పోటీగా వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. ఆయన వైసీపీలో ఎన్నికల ముందు జాయిన్ అయ్యి అనూహ్యంగా వంశీ పై పోటీకి సీటు దక్కించుకున్నాడు.
ఆ ఎన్నికల్లో యార్లగడ్డ చాలా బలంగా పని చేశారు. కేవలం 800 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఇప్పుడు వంశీ వైసీపీలో జాయిన్ అవ్వడంతో యార్లగడ్డ సీటుకు ఎసరు వచ్చింది. ఇటీవల ఆయన ఒక సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున తాను గన్నవరం నుండి పోటీ చేస్తాను అన్నట్లుగా ప్రకటించాడట. దాంతో వంశీ వర్గీయుల్లో ఆందోళన మొదలు అయ్యింది. అదే సమయంలో పార్టీ నాయకులు గన్నవరంలో పార్టీ రెండుగా చీలుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా కొడాలి నాని రంగంలోకి దిగి యార్లగడ్డకు సర్దిచెప్పి రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో పోటీ చేయబోతున్న వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో యార్లగడ్డ స్పందన ఏంటో అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. గన్నవరం పంచాయితీ ప్రస్తుతానికి తేలిపోయినట్లుగా అనిపిస్తున్నా ఎన్నికల నాటికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.