Kalipka Ganesh: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గతకొంత కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఆమె ఇటీవల రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి సంబంధించి మూడో స్టేజీలో ఉందని, ప్రస్తుతం ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లుగా సామ్ పేర్కొంది. అయితే ఈ బ్యూటీ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూనే సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె నటించిన యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుని సందడి చేస్తోంది. ఈ సినిమాను సరోగసి నేపథ్యంలో తెరకెక్కించగా, దర్శకద్వయం హరి-హరీశ్‌లు ఈ సినిమాను అదిరిపోయే ట్విస్టులతో తెరకెక్కించారు.
కాగా, ఈ సినిమా సక్సెస్‌ను చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తుండగా ఇటీవల ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సమంత గురించి, ఆమె బాధపడుతున్న వ్యాధి గురించి అందరూ మాట్లాడగా, ఓ నటి మాత్రం అందరికీ షాకిచ్చింది. తాను కూడా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరు? అనే ప్రశ్న మీలో తలెత్తుతుందా.. యశోద సినిమాలో నటి కల్పిక గణేశ్ ఓ మంచి పాత్రలో నటించింది. ఆమె పాత్ర సినిమాలో గుర్తుండిపోయే పాత్రగా చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో సమంతతో నటించనప్పుడు తాను సంతోషంగా ఫీల్ అయ్యానని.. కానీ ఆమె ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలుసుకుని, తాను చాలా బాధపడ్డానని కల్పిక గణేశ్ తెలిపింది.
కష్టాలు అందరికీ ఉంటాయని, అలాగే తాను కూడా చాలా బాధలో ఉన్నట్లుగా ఆమె పేర్కొంది. తాను గత 13 సంవత్సరాలుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నానని, అలాగే తనకు మయోసైటిస్ వ్యాధి కూడా ఉందని, అయితే తనకు ఫస్ట్ స్టేజీలోనే ఉందని, సామ్‌కు మూడో స్టేజీలో ఉందని ఆమె పేర్కొంది. సామ్ కూడా ఈ సక్సెస్ మీట్‌కు హాజరవుతుందని తనకు చెప్పడంతో, డాక్టర్ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఈ సక్సెస్ మీట్‌కు వచ్చానని కల్పిక గణేశ్ పేర్కొంది. ఏదేమైనా ఇలా వరుసగా హీరోయిన్లు తమకున్న వ్యాధుల గురించి బట్టబయలవుతుండటంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.