కోడి కత్తి కేసు ఏమయ్యింది.? అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘ఆ కేసు విచారణ చేస్తోన్నది ఎన్ఐఏ.. అది జాతీయ దర్యాప్తు సంస్థ. మీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో వుంది గనుక.. ఆ బీజేపీని అడగండి ఆ కేసు గురించి..’ అని వైసీపీ సమాధానమిస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏమయ్యింది.? అని జనసేనాని పవన్ కళ్యాణ్ అధికార వైసీపీని నిలదీశారు. ‘ఆ కేసు విచారణ చేస్తోన్నది సీబీఐ. అది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ. మీ మిత్రపక్షం బీజేపీనే కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి, ఆ కేసు విచారణ త్వరగా చేయాలని మీరే కోరండి.. ప్రత్యేక హోదా అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదని చెప్పి.. ఆ ఒక్క కేసు విచారణ త్వరగా తేల్చేయమని మీరు కోరితే మేం స్వాగతిస్తాం..’ అని వైసీపీ అంటోంది.
పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నదేంటి.? వైసీపీ సమాధానమిస్తున్నదేంటి.? కోడి కత్తి కేసులో స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితుడు. ఆయనే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎవరు ఆ దాడి చేయించారో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పరిధిలో ఓ సిట్ వేసుకోలేరా.? వేసి, నిజాలు తేల్చలేరా.?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయానికొస్తే, అది సీబీఐ విచారణ పరిధిలో వున్నమాట వాస్తవం. అలాగని, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు సంగతేంటో తేల్చకూడదన్న రూల్ ఏమైనా వుందా.? మృతుడు స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయ్. ఈ కేసులో న్యాయం కోసం ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు నానా యాగీ చేశారు కదా.?
గొడ్డలి పోటుని గుండె పోటుగా ఎందుకు చిత్రీకరించాల్సి వచ్చింది.? అన్న దగ్గర్నుంచి కేసు విచారణ మొదలైతే, చిక్కు ముడి వీడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.!
ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు, అడ్డగోలుగా వ్యవహరిస్తుంటారన్నది తేటతెల్లమైపోయింది. చిత్రమేంటంటే, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుల్లో నిజాల్ని నిగ్గు తేల్చకపోవడం. ఏళ్ళు గడుస్తున్నా, ఆ జాతీయ దర్యాప్తు సంస్థలకే ఈ చిక్కుముడి విప్పడం అర్థం కాకపోతే.. ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఇంత జాప్యం జరుగుతోంటే.. ఇక దేశంలో న్యాయమంటూ వున్నట్టా.? లేనట్టా.?