తెలంగాణలో బీజేపీ హవా కనిపిస్తోందని.. రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన స్వాగత సభలో ఆయన మాట్లాడారు. ‘కుటుంబ పాలనలో తెలంగాణ మగ్గిపోతోంది. ఒక్క కుటుంబం కోసం రాష్ట్రం ఏర్పాటు కాలేదు. రాష్ట్రంలో కుటుంబపాలన, అవినీతితో అభివృద్ధి జరగడం లేదు. తెలంగాణ అభివృద్ధి కోసం యువతతో కలసి ముందుకెళ్తాం. తెలంగాణ ప్రజలు ఎంత సమర్ధులో నాకు తెలుసు’.
‘రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నా. వారితోపాటు ప్రజల ఆశయాలు కూడా రాష్ట్రావిర్భావంత తర్వాత నెరవేరలేదు. సబ్ కా వికాస్, సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ సూత్రంతో బీజేపీ పని చేస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. ఎనిమిదేళ్లలో ఎనిమిది వేల స్టార్టప్ లు తీసుకొచ్చాం. తెలంగాణను కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడి ప్రజలెంతో పట్టుదల కలవారు. ఎప్పుడొచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు’ అని అన్నారు.