తెలంగాణ లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను సచివాలయం చూసేందుకు వెళ్తానంటే అడ్డుకున్నారని అన్నారు. అందుకే తాను వద్దన్నానని, దేవుడు కూడా వద్దని అనుకున్నాడని.. దాంతో సచివాలయం కాలిపోయిందని కేఏ పాల్ అన్నారు.
తనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని, దేవుడు కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నాడని దీంతో నిరూపితమైందని పేర్కొన్నాడు. దేవుడికి నచ్చక పోవడం వల్లే సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందని పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాప పడాలని పాల్ సూచించారు. అంబేద్కర్ సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఏంటని కూడా పాల్ ప్రశ్నించాడు. తెలంగాణ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడానికి పాల్ హైకోర్టులో సవాలు చేశారు.
సీఎం వ్యక్తిగత ప్రచార నిమిత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందులో భాగంగానే కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని పాల్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జన్మించిన ఏప్రిల్ 14న సచివాలయ ప్రారంభోత్సవం జరగాలని పాల్ డిమాండ్ చేస్తున్నారు.