Hyderabad: కొన్ని జంటలు కబుర్లు, కాలక్షేపానికి పబ్లిక్ పార్కులను వేదికగా చేసుకుంటారు. అయితే.. అక్కడ అనైతిక చర్యలకు పాల్పడితే..? పబ్లిక్ పార్కులకు అనేకమంది వస్తారు. వాహ్యాళికి, వాకింగ్, ప్రకృతి ఆరాధకులు, వయోధికులు, చిన్న పిల్లలతో తల్లిదండ్రులు, ఆటలు, సరదా కబుర్ల కోసం. మరి.. ఇంతమంది మధ్య ప్రేమికులు అనైతిక చర్యలకు పాల్పడి ఇబ్బంది తీసుకురావడం సరైనది కాదు. దీనిపైనే దృష్టి సారించారు హైదరాబాద్ (Hyderabad) పోలీసులు. షీ టీమ్స్ ను రంగంలోకి దించి అటువంటివారిని అదుపులోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
నగరంలోని పలు బహిరంగ ప్రదేశాలు.. పార్కుల్లో కొన్ని జంటలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ పలు బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్న 12 జంటలను అదుపులోకి తీసుకున్నాయి. వారికి ఫైన్ వేసి.. కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇకపై ఇటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని.. షీ టీమ్స్ నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు.