సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal) అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కేజ్రివాల్ ని ఈడీ ఆఫీస్ కి తరలిస్తున్నారు. తొలుత ఆయన ఫోన్ తో పాటు పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు పది మందితో కూడిన అధికారుల బృందం పదోసారి సమన్లు జారీ చేసేందుకు ఆయన నివాసానికి చేరుకుంది. సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఈడి అధికారులను అడ్డుకోగా సెర్చ్ వారెంట్ తో వచ్చినట్లు తెలిపారు.
మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ కి 9సార్లు సమన్లు అందాయి. ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు ఈ కేసులో ఆయనకి హైకోర్టులోను ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వమని ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వలేమంటూ కోర్టు తేల్చి చెప్పింది. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే ఆయన అరెస్ట్ అవ్వడం గమనార్హం.