హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో నటించి ఈ మద్యే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. టివి హోస్ట్ గా ప్రవేశించి, ఆ తరువాత తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర, లాంటి సరికొత్త సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతికి ఆ తరువాత వరుస పరాజయాలు క్యూ కట్టడంతో ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో తమిళం, మలయాళ భాషల్లో ప్రయత్నాలు మొదలు పెట్టి అక్కడ మూడు, నాలుగు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
లేడి ఓరియెంటెడ్ కథలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన స్వాతి, తమిళంలో కూడా అవకాశాలు తగ్గడంతో మళ్ళీ తెలుగులో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ తరువాత ఎన్నో ఆశలు పెట్టుకున్న చేసిన త్రిపుర, లండన్ బాబులు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆమె పెళ్ళికి సిద్ధమైంది. ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్న స్వాతి ఏడాది కాపురం తరువాత మళ్ళీ నటనను కొనసాగించేందుకు సిద్ధం అవుతుందని, ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
కలర్స్ స్వాతి రీ ఎంట్రీ కార్తికేయ సినిమా సీక్వెల్ తో ఉంటుందని టాక్. స్వాతి ఎక్కువగా నిఖిల్ సరసన నటించింది. తాజాగా మరోసారి కార్తికేయ సీక్వెల్ తో నిఖిల్ సరసన నటించేందుకు రెడీ అయిందట. ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన కథ చర్చలు జరుగుతున్నట్టు టాక్. ఇటీవలే ఓ కార్యక్రమంలో స్వాతి స్పందిస్తూ తాను రీ ఎంట్రీ ఇస్తున్నానని, తనకు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టిన కార్తికేయ సీక్వెల్ లో నటిస్తున్నానంటూ చెప్పడంతో స్వాతి రీ ఎంట్రీ ఖరారైంది. మరి ఈ సినిమా తరువాత ఈ అమ్మడు సినిమాలు కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.
