Bala Krishna Birthday Specials: నందమూరి బాలకృష్ణను పరిశ్రమలో మాస్ హీరో అంటారు. ఆయన కూడా తన సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉండేలానే ప్లాన్ చేస్తారు. అయితే.. కెరీర్ మొదటి నుంచీ ఆయనలో తండ్రి ఎన్టీఆర్ ప్రభావంతో ఫ్యామిలీ ఇమేజ్ ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ ను అభిమానించిన వారంతా బాలకృష్ణలో అదే ఇమేజ్ చూశారు. నిజానికి ఓ హీరోకి మాస్ ఇమేజ్ ఎంత ముఖ్యమో ఫ్యామిలీ ఇమేజ్ అంతే ముఖ్యం. అప్పుడే కుటుంబాలు ఓ హీరోను మరింతగా అభిమానిస్తారు. బాలకృష్ణ చూసిన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కూడా ఫ్యామిలీ కంటెంట్ మూవీనే. అదే మంగమ్మగారి మనవడు. పల్లె వాతావరణం కథ, భావోద్వేగాలు కలగలసిన ఆ సినిమాలో పంచెకట్టులో బాలకృష్ణ ప్రేక్షకుల్ని మెప్పించారు. దీంతో ఆ సినిమా సంచలన విజయం సాధించి ఏడాదికి పైగా రన్ అయింది.
పల్లె వాతావరణంలో సినిమాలు..
ఆ తర్వాత ఆయన అనేక సినిమాలు పల్లె వాతావరణం, కుటుంబ కథలు, సెంటిమెంట్ ప్రధానంగా చేశారు. వాటిలో మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, ముద్దుల మావయ్య, బంగారుబుల్లోడు, నారీ నారీ నడుమ మురారి, బొబ్బలి సింహం, వంశానికొక్కడు, పెద్దన్నయ్య.. వంటి అనేక హిట్ సినిమాల్లో అచ్చ తెలుగు వాతావరణం ప్రతిబింబించే సినిమాల్లో నటించి మెప్పించారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో బాలకృష్ణకు మంచి ఇమేజ్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ తనయుడిగా ఆయన పేరు నిలబెట్టారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం తర్వాత బాలకృష్ణ ఆ తరహా సినిమాలు చేయడంతో ప్రేక్షకులు ఆయనలో ఎన్టీఆర్ ను చూసుకున్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగుదనం నిండుగా ఉన్న కథల్లో నటించిన బాలకృష్ణకు ఆ తరహా సినిమాలే అప్పట్లో ఎక్కువ విజయాలను అందించాయి.
తండ్రి బాటలోనే..
90వ దశకం తర్వాత బాలకృష్ణ ఎక్కువగా మాస్ కథాంశాల వైపే మొగ్గు చూపారు. అయితే.. తన సినిమాల్లో అంతర్లీనంగా సెంటిమెంట్, కుటుంబ నేపథ్యం ఉన్న సన్నివేశాలను ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు ఫ్యాక్షన్ నేపథ్యమే అయినా ఫ్యామిలీ కంటెంట్ ఉండటంతో అవి అద్భుత విజయాలు అందుకున్నాయి. ఆయా సన్నివేశాల్లో బాలకృష్ణ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. తండ్రి ఎంతటి మాస్ హీరో అయినా.. ఫ్యామిలీ కంటెంట్ సినిమాలతోనే అద్భుత జనాదరణ పొందారు. బాలకృష్ణ కూడా తొలినాళ్లలోనే కాదు.. ఇప్పటికీ ఆయన ప్రతి సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇస్తారు. బాలకృష్ణలోని మంచి నటుడిని వెలికి తీసిన వాటిలో ఫ్యామి కంటెంట్ సినిమాలదే అగ్రభాగం అని చెప్పాలి.