‘మా నాన్నని దారుణంగా చంపేశారు.. అతి కిరాతకంగా హత్య చేశారు.. మాకు న్యాయం చేయండి..’ అంటూ మొత్తుకుంటున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. 2019 ఎన్నికల సమయంలో ఆ సునీతారెడ్డి వెంట తిరిగి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని రాజకీయంగా ఓ రేంజ్‌లో వైసీపీ వాడుకున్న విషయం విదితమే.
ఎన్నికలయ్యాక సునీతా రెడ్డిని వైసీపీ పట్టించుకోవడమే మానేసింది. స్వయానా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి బాబాయ్ అవుతారు. రాజశేఖర్ రెడ్డి సోదరుడే వివేకానందరెడ్డి. మరి, బాబాయ్ హత్య కేసు విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత చొరవ చూపాలి. చెల్లెమ్మకి ఎంతలా బాసటగా నిలిచి వుండాలి.?
ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకి బదిలీ అయ్యింది. దానర్థమేంటి.? ఏపీలో విచారణ జరిగితే న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని సునీతారెడ్డి అనడం దేనికి సంకేతం.? సునీతారెడ్డి సంగతి కాస్సేపు పక్కన పెడితే, వైఎస్ షర్మిల ఎందుకు ఏపీ రాజకీయాలు వదిలేసి, తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నట్టు.?
పోనీ, అన్నా చెల్లెళ్ళు తెలుగు రాష్ట్రాల్ని రాజకీయంగా పంచుకున్నారనే అనుకుందాం. వైఎస్ జగన్ తన సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో అరెస్టయితే కనీసం ఎందుకు స్పందించలేదు.? తెలంగాణలోని అధికార పార్టీతో రాజకీయంగా చిక్కులు ఎదుర్కోవాల్సి రావొచ్చన్న భయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుంటే వుండొచ్చుగాక.. కానీ, వైఎస్సార్ అభిమానుల కోసం అయినా.. షర్మిలకు బాసటగా వైఎస్ జగన్ నిలవాలి కదా.?
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ఆంధ్రప్రదేశ్‌తో మనకేంటి పని.?’ అని వైఎస్ విజయలక్ష్మి అనాల్సి వచ్చిందంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళకూ.. అంటూ ‘జగనన్న’ ఇచ్చే ప్రసంగాలు ఓ రేంజ్‌లో వుంటాయి. ప్రజల సంగతి తర్వాత.. ముందుగా ఇంట్లోని చెల్లెళ్ళ మాటేమిటి.? తల్లి మాటేమిటి.?