వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే చాలు, ‘చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్’ అని విమర్శించడం వైసీపీ నేతలకు అలవాటైపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర్నుంచి, ఆ పార్టీ కోసం పని చేసే సోషల్ మీడియా కార్మికులదాకా.. అందరిదీ ఇదే పంథా.!
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతున్నది ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్.? ఇప్పడీ చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో చాలా చాలా గట్టిగా జరుగుతోంది. అందుక్కారణం, గత కొంతకాలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు బహిరంగ సభల్లో స్క్రిప్ట్ చదువుతుండడమే.
ఔను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగించడం మానేశారు.. ఆ స్థానంలో ఆయన ఈ మధ్య స్క్రిప్ట్ చదవడం మొదలు పెట్టారు. అలా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడంలో కూడా తరచూ తడబడుతున్నారాయన.! ఆ తప్పుల్ని నెటిజన్లు పట్టుకుని, సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ స్క్రిప్ట్ రాసిస్తున్నదెవరు.? ఈ విషయమై భిన్నవాదనలున్నాయి. అధికారంలో ఎవరున్నా వారికి, సలహాదారులుంటారు.. స్క్రిప్ట్ పరంగా సలహాలు ఇచ్చేవారూ వుంటారు. సో, ఈ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తప్పుపట్టడానికేమీ లేదన్న వాదన ఒకటి వుంది.
అయినాగానీ, ఇంతవరకు దేశ రాజకీయాల్లో ఇలా బహిరంగ సభల్లో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదవడం.. అది కూడా ఓ ముఖ్యమంత్రి, ప్రసంగం స్థానంలో పాఠం చదవడం ఎప్పుడూ లేదన్నది ఇంకొందరి అభిప్రాయం.
‘దుష్టచతుష్టయం..’ వంటి మాటలు వైఎస్ జగన్ నోట అలవోకగా వచ్చేందుకు వీలు లేదు.. అవి స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయన్నది టీడీపీ అనుకూల మీడియా తెరపైకి తెస్తున్న అంశం. నిజానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ మోస్తరు వాగ్ధాటి గలిగిన నాయకుడే. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి. కానీ, ఇప్పుడేమయ్యింది.? ఎందుకాయనలో ప్రసంగాల విషయమై కాన్ఫిడెన్స్ పోయింది.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.