సినిమా పరిశ్రమను బతికించుకునేందుకు గాను టాలీవుడ్ ఒక ముందడుగు వేసింది. ఓటీటీ ల పోటీని తట్టుకోలేక ఢీలా పడిపోతున్న థియేటర్లను రక్షించుకునేందుకు గాను నిర్మాతల మండలి కీలక నిర్ణయానికి సిద్దం అయ్యింది. కరోనా ముందు వరకు ఒక సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత కనీసం 50 రోజుల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ మరియు శాటిలైట్ టెలికాస్ట్ కు వెయిట్ చేయాల్సి ఉండేది. కాని కరోనా కారణాల వల్ల మొత్తం పరిస్థితి మారింది.
చాలా సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అవ్వడంతో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య భారీగా పెరిగింది. కనుక థియేటర్ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వెళ్తున్నారు. ఎంత త్వరగా స్ట్రీమింగ్ కు అనుమతి ఇస్తే అంత ఎక్కువ డబ్బులు నిర్మాతలకు ఓటీటీ ల నుండి వస్తున్నాయి. అందుకే పుష్ప ఒక వైపు థియేటర్లలో భారీగా షేర్ రాబడుతున్న సమయంలోనే ఓటీటీ లో మూడవ వారంలోనే వచ్చేసింది. ఇక నుండి అలాంటి పరిస్థితి ఉండదు.
సినిమా థియేట్రికల్ స్క్రీనింగ్ 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మూడు వారాలు అయితే ఓటీటీ లో వస్తుంది కదా… నాలుగు వారాల్లో ఇంట్లోనే కూర్చుని చూద్దాం అనుకునే వారు ఇప్పుడు 50 రోజులు అవ్వడంతో తప్పనిపరిస్థితుల్లో థియేటర్ కు వెళ్లాల్సిందే. ఈ నిర్ణయం సినిమా ను.. థియేటర్లను కాపాడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.