హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.? ఫెయిల్ అయ్యిందా.? కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం పదండిక.
కథ:
ప్రేమించి, పెళ్ళి చేసుకున్న తన సోదరి చనిపోయిందన్న వార్తతో చలించిపోతాడు న్యాయవాది శివ శంకర్. తన చెల్లెలు ఆత్మహత్య చేసుకోలేదని బలంగా నమ్మే శివ శంకర్, చెల్లెలి మరణం వెనుక కారణాన్ని ఛేదించేందుకు వెళతాడు. అక్కడే, అతనికి దుష్ట శక్తుల గురించి తెలుస్తుంది. ఆ దుష్ట శక్తి ఎందుకు హత్యలు చేస్తోంది.? దాన్ని ఎలా శివశంకర్ మట్టుబెట్టాడు.? అన్నది మిగతా కథ.
నటీనటులు:
దర్శకుడు సుందర్, ఈ సినిమాలో హీరోగానూ నటించాడు. అతని నటన గురించి పెద్దగా మాట్లాడుకోవడానికేమీ లేదు. సుందర్ సి ఫేస్‌లో పెద్దగా ఎక్స్‌ప్రెషన్స్ పలకవు. యాక్షన్ ఎపిసోడ్స్‌లోనూ ఈజ్ ఏమీ చూపించలేకపోయాడు.
పిల్లల్ని కాపాడుకోడానికి పరితపించే తల్లిగా కనిపించింది తమన్నా. నటించడానికి పెద్దగా స్కోప్ లేదామెకి. ఉన్నంతలో ఓకే. రాశి ఖన్నా యాజ్ యూజువల్.. వుందంటే, వుందంతే.! ఆమెకీ పెద్దగా స్కోప్ లేదు.
కోవై సరళకి ఇలాంటి సినిమాలు కొట్టిన పిండి. తనకిచ్చిన పాత్రకు తనదైన ‘అతి’ని జోడించిందామె. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి.. ఈ ఇద్దరికీ స్క్రీన్ మీద బాగానే స్పేస్ దక్కింది. వున్నంతలో నవ్వించేందుకు బాగానే ప్రయత్నించారు.
మిగతా పాత్రల్లో జయప్రకాష్ తదితరులు జస్ట్ ఓకే.!
సాంకేతిక నిపుణులు..
ఈ తరహా సినిమాలకు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ. అది సోసోగా అనిపిస్తుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్‌గా వుండి వుంటే బావుండేది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. అద్భుతాలేం లేవు.
వీఎఫ్ఎక్స్ ఏమంత ఎఫెక్టివ్‌గా లేకపోవడం ఇంకో మైనస్ పాయింట్. జంప్ స్కేర్స్ లాంటివి పెద్దగా ఏమీ లేవు. డైలాగ్స్ బాగానే వున్నాయి. వెన్నెల కిషోర్ – శ్రీనివాస్ రెడ్డిల కోసం రాసిన తెలుగు డైలాగ్స్ బాగా సెట్ అయ్యాయి.
భయపెడుతూ నవ్వించడం, నవ్విస్తూ భయపెట్టడం అనేది ఓ ఆర్ట్. దర్శకుడు ఈ రెండిటినీ మేనేజ్ చేయడంలో సక్సెస్ అవలేకపోయాడు. సీరియస్ టోన్ నుంచి ఫన్ టోన్, ఫన్ టోన్ నుంచి సీరియస్ టోన్‌లోకి ట్రాక్ ఛేంజ్ అంత బాగా కుదరలేదు.
నిర్మాణపు విలువలు ఓకే.
ప్లస్ పాయింట్స్
వెన్నెల కిషోర్ – శ్రీనివాస్ రెడ్డి పండించిన కామెడీ
మైనస్ పాయింట్స్
హీరో పాత్ర
పూర్తిగా భయపెట్టలేకపోవడం – పూర్తిగా నవ్వించలేకపోవడం
బోర్ కొట్టించే సన్నివేశాలు
విశ్లేషణ..
హీరోగా సుందర్‌ని తెరపై చూడాల్సి రావడం, తెలుగు ప్రేక్షకులకు అస్సలు మింగుడుపడదు. చెల్లెలికీ, అన్నకీ మధ్య ఎమోషనల్ బాండ్ గురించి కనెక్టింగ్ సీన్స్ లేవు. తమన్నా మంచి పెర్ఫామర్ అయినా, ఆమెకు అంత స్కోప్ ఇవ్వలేదు. రాశి ఖన్నా పాత్ర వృధా అయిపోయింది. అటు పూర్తిగా భయపెట్టలేక, ఇటు పూర్తిగా నవ్వించలేక.. ఎటూ కాకుండా పోయింది సినిమా. ఇది పూర్తిగా దర్శకుడి వైఫల్యమే. హాలీవుడ్ మూవీస్ నుంచి కొన్ని సీన్స్ యధాతథంగా లేపేసినట్లు అనిపిస్తుంది. భయపెట్టే సీన్స్ వస్తే ఆడియన్స్ సెటైర్లు వేశారంటే, సినిమా ఫలితం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 2 / 5