తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నొక ఐకానిక్ బిల్డింగ్‌గా అభివర్ణించొచ్చు. ఏడెకరాల స్థలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని సకల సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ భవనాన్ని నిన్న ప్రారంభించిన విషయం విదితమే.
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ మాటేమిటి.? గడచిన ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం చాలా ప్రగతి సాధించింది. కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యింది.. అదీ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే నిర్మించుకుంది. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వున్నా, ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాజెక్టుని నిర్మించుకోలేకపోతోంది.
చెప్పుకుంటూ పోతే ఒకటా.? రెండా.? కుప్పలు తెప్పలుగా వున్నాయ్. తెలంగాణ ప్రభుత్వంపైనా విపక్షాల ఆరోపణలు మామూలే. అక్కడా రాజకీయం నడుస్తోంది. అక్కడా అధికార పార్టీ మీద రాజకీయ విమర్శలు సర్వసాధారణమే. కాకపోతే, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో జుగుప్సాకరమైన రాజకీయాలైతే తెలంగాణలో లేవన్నది నిర్వివాదాంశం.
నిజానికి, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో తెలంగాణలోని అధికార పక్షం తలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలోని అధికార పార్టీ ఒకింత ఎక్కువ వ్యతిరేకతను, బీజేపీ నుంచి ఎదుర్కోవాలి. తెలంగాణలో రాజకీయం మరింత జుగుప్సాకరంగా తయారవ్వాలి. కానీ, ఆ పరిస్థితి తెలంగాణలో లేదు.
తెలంగాణలో ఓ ఫ్లై ఓవర్, ఓ ఐకానిక్ భవనం.. ఇంకోటేదో అభివృద్ధి కార్యక్రమం జరుగుతోంటే, ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు చేసి బటన్ నొక్కుడు వ్యవహారాలు జరుగుతున్నాయి. అంతేనా, కొత్తగా.. అధికార పార్టీ ప్రజా ప్రతినిథులు చేస్తోన్న హత్యలు, వారు ప్రదర్శిస్తోన్న రాసలీలలు వార్తల్లో ముఖ్యాంశాలవుతున్నాయి.