లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురైన హీరో తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. హీరో బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నను చూసుకుంటున్నారు.
ఈనేపథ్యంలో హిందూపురం పార్లమెంట్ కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో తారకరత్న కుటుంబసభ్యుల్ని కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘తారకరత్నను పరిస్థితులను బట్టి మెరుగైన వైద్యం నిమిత్తం విదేశాలకు తీసుకెళ్ళే ఆలోచనలో కుటుంబసభ్యులు ఉన్నారు. ఈరోజు ఆయన మెదడు స్కానింగ్ తీశారు. రిపోర్ట్స్ బట్టి ఆయన మెదడు పనితీరు తెలుస్తుంది. తారకరత్నతోపాటు ఆయన భార్య అలేఖ్య, తండ్రి మోహనకృష్ణ కుటుంబసభ్యులు ఉన్నారు.’
‘హిందూపురం నాయకులు తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్యంపై పూజలు చేశారు. ఆసుపత్రిలోని విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని బాలకృష్ణ ఆసుపత్రి ప్రాంగణంలో మృత్యుంజయ హోమం చేపట్టారు. త్వరలోనే తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగివస్తారు’ అని అన్నారు.