Prabhas : ప్రభాస్ తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఆదిపురుష్ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజీ పై లక్ష మంది అభిమానుల సాక్షిగా ప్రభాస్ మాట్లాడుతూ ఇకపై ఏడాదికి రెండు సినిమాలతో రాబోతున్నట్లుగా ప్రకటించాడు. వీలు అయితే మూడు సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటూ ప్రకటించాడు.
అదే సమయంలో ప్రభాస్ ఆలస్యం అయితే తన బాధ్యత కాదు.. దర్శకుల బాధ్యత అన్నట్లుగా కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. నిజమే ప్రభాస్ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉన్నా కూడా ఆయన దర్శకులు ఆయనతో సినిమాలను స్పీడ్ గా చేసేందుకు సాహసం చేస్తారా అంటే అనుమానమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ తో సినిమా అనగానే దర్శకుల్లో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. దాంతో సినిమా ఆరు నెలల్లో అనుకున్నది కాస్త ఏడాదిన్నర అవుతుంది. అందువల్ల ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలనుకున్న ప్రభాస్ కోరిక తీరే అవకాశం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్శకులు ముందస్తుగా ప్లాన్ చేస్తే కచ్చితంగా ప్రభాస్ కోరుకున్నట్లుగా స్పీడ్ గా సినిమాలు చేసే అవకాశం ఉంది.