‘ఇదే అర్థం పర్థం లేని విమర్శలు, భౌతిక దాడులు కొనసాగిస్తే, నాలోని తీవ్రవాదిని చూస్తారు..’ అంటూ అధికార వైసీపీని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
రిపబ్లిక్ డే వేడుకల్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన అధినేత, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గోల్ మాల్ తదితర వ్యవహారాలపై అధికార పార్టీ తీరుని తప్పు పట్టారు. ప్రభుత్వ పాలన ప్రజాకంటకంగా మారిందని మండిపడ్డారు జనసేన అధినేత.
‘రాయలసీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రాన్నీ, విభజన తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్నీ పాలించారు.. ఆ రాయలసీమకి మీరేం చేశారు..’ అని ప్రశ్నించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమీ బాలగంగాధర్ తిలక్ కాదు. డబ్బులు దొబ్బేసి జైలుకెళ్ళారు. అలాంటి వ్యక్తిని చూసి సింపతీ ఎలా వస్తుంది.? నాకైతే రాదు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు గడించాడు. అలా గడించిన కోట్లతో రాజకీయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తుల్ని రాజకీయంగా ఢీకొనాలంటే.. ప్రజలు జనసేనకు బలాన్నివ్వాలి..’ అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.
‘తండ్రి మృతదేహాన్ని పక్కన పెట్టుకుని, ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడిన వ్యక్తి ప్రజలకు మంచి పాలన ఎలా అందిస్తాడు.? ప్రజలకెందుకు మంచి చేస్తాడు.?’ అని ప్రశ్నించిన జనసేనాని, ‘జనసేన పార్టీకి అవకాశమివ్వండి.. మంచి పాలన అందిస్తాను. రాష్ట్ర భవిష్యత్తు బావుంటుంది. ఏం జరిగినా రాజకీయాల్ని మాత్రం వదలను..’ అంటూ జనసేనాని చెప్పుకొచ్చారు.
కాగా, జనసేనాని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మరోపక్క, సహజంగానే అధికార పార్టీ నేతలు మూకుమ్మడిగా జనసేనానిపై మాటల దాడికి దిగారు. ఒక్కరంటే ఒక్కరూ జనసేనాని ప్రశ్నలకు సమాధానం చెప్పలేరుగానీ, జనసేనానిపై వ్యక్తిగత మాటల దాడికి దిగుతున్నారు.