లోకేశ్ చేపడుతున్న యువగళం వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని హీరో, నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదు. ఇసుక, వైన్, మైన్ తప్పితే ఆయనకు ప్రజల సమస్యలు పట్టడం లేదు. లోకేశ్ యువగళంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మొత్తం బయటకొస్తుంది’.
‘రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రజలు వలస పోతున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇండియా మ్యాప్ నుంచి ఏపీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ప్రజలు లోకేశ్ ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. నేనూ లోకేశ్ కు సంఘీభావంగా హిందూపురంలో పలు కార్యక్రమాలు చేపడతాను. యువగళం కార్యక్రమంలో నేనూ పాల్గొంటాను. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారు, యువగళంతో ఏపీకి భవిష్యత్తు ఉంటుంది’ అని అన్నారు.