జక్కన్న రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్.. ఈ ముగ్గురూ కలిస్తేనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సాధ్యమైంది. ‘ఆర్’ అంటే రాజమౌళి.. ‘ఆర్’ అంటే రామ్ చరణ్.. ‘ఆర్’ అంటే రామారావు (జూనియర్ ఎన్టీయార్) మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం పనిచేసిన సంగీత దర్శకుడు.. ఇతర నటీనటులు, టెక్నీషియన్లు.. ఒకరేమిటి.? ప్రతి ఒక్కరికీ సినిమా సక్సెస్‌లో భాగం వుంటుంది.
‘ఇది నా సినిమా’ అని రామ్ చరణ్ చెప్పుకోలేదు, ఎన్టీయార్ చెప్పుకోలేదు.. రాజమౌళి కూడా చెప్పుకోవడంలేదు. ‘ఇది తెలుగు సినిమా.. ఇది ఇండియన్ సినిమా..’ అంటున్నారు. దురదృష్టం, కొందరు హీరోల అభిమానులు, అంతర్జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి దక్కుతున్న పేరు ప్రఖ్యాతుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో మొదటి వరుసలో వుంటోంది యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులే.
ఎన్టీయార్ కొత్త సినిమా ఎప్పుడో తెలియక, దర్శకుడ్నీ.. నిర్మాతనీ తిట్టిపోస్తున్న ఆ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులే, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ పరువు తీసేస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో. వ్యక్తిగత కారణాల వల్ల ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల ప్రదానోత్సవానికి జూనియర్ ఎన్టీయార్ వెళ్ళలేదు.
రామ్ చరణ్‌ని ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంబందించి ఓ ప్రెజెంటర్‌గా హెచ్‌సిఏ ఆహ్వానించింది. అంతే, యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా ‘హెచ్‌సిఎ’పై విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ఎందుకీ పంచాయితీ.? అనుకుందో ఏమోగానీ, ‘ఎన్టీయార్ కోసం కూడా ఓ అవార్డు వుంది..’ అంటూ ‘హెచ్‌సిఎ’ ప్రకటించాల్సి వచ్చింది.
నిజానికి, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంతటికీ వేర్వేరుగా మెమెంటోస్ ప్లాన్ చేశారు. ఇప్పుడీ ఎన్టీయార్ అభిమానుల అత్యుత్సాహం కారణంగా, అక్కడికేదో ‘ఏడవకండి.. మీ హీరోకి కూడా ఓ అవార్డు ఇచ్చేస్తున్నాం..’ అన్నట్లుగా ‘హెచ్‌సిఎ’ ప్రకటించినట్లయ్యింది. ఎన్టీయార్ అభిమానులే, ఎన్టీయార్ స్థాయిని దిగజార్చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
వాస్తవానికి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైన తొలి రోజున, యంగ్ టైగర్ ఎన్టీయార్ పాత్రపై పెదవి విరిచింది ఈ అభిమానులే. వీళ్ళే ఇప్పుడు తమ హీరో విషయమై లేనిపోని ఓవరాక్షన్ చేస్తున్నారు. ‘ఎన్టీయార్‌ని రాజమౌళి వెన్నుపోటు పొడిచాడు.. గెస్ట్ రోల్‌లా ఎన్టీయార్ పాత్రని రాజమౌళి మార్చేశాడు..’ అని ఆరోపించినోళ్ళే, ‘ఆర్ఆర్ఆర్’లో మెయిన్ హీరో రామ్ చరణ్ కాదు.. ఎన్టీయార్.. అని కొత్త పల్లవి అందుకుంటున్నారు.
రామ్ చరణ్ కావొచ్చు.. ఎన్టీయార్ కావొచ్చు.. అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. తమ మధ్య సన్నిహిత సంబంధం.. అంతకు మించి, అన్నదమ్ముల్లాంటి అనుబంధం గురించి ఎంతలా చెబుతున్నా, ఈ జూనియర్ ఎన్టీయార్ అభిమానుల ముసుగేసుకున్న కొందరికి అర్థం కాదే.!
జూనియర్ ఎన్టీయార్‌ని అవమానిస్తున్నారా.? మొత్తంగా ఇండియన్ సినిమానే అవమానిస్తున్నారా.? పైగా, కులం పేరుతో ఓ సెక్షన్ అభిమానులు అత్యంత జుగుప్సాకరమైన ప్రవర్తన ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం.. ఈ ప్రవర్తనని చూసి ఆశ్చర్యపోతోంది, చీదరించుకుంటోంది కూడా.!
ముందు ముందు ఆస్కార్ పురస్కారాల వేడుక వుంది. ఆ వేడుకకి ఎన్టీయార్ హాజరైతే, అక్కడ ‘మీ అభిమానులు ఇంత ఛండాలంగా తయారయ్యారేంటి.?’ అన్న ప్రశ్న వస్తే, దానికి ఆయన ఏం సమాధానం చెబుతాడన్న ఇంగితమైనా ఆ అభిమానులకి వుండాలి కదా?
యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు రచ్చ చేస్తే, ‘ఆర్ఆర్ఆర్’ స్థాయి తగ్గిపోదు. రామ్ చరణ్‌కి దక్కిన ‘ఇంటర్నేషనల్ సూపర్ స్టార్’ ఇమేజ్‌కి మకిలి అంటదు. కానీ, జూనియర్ ఎన్టీయార్ తలెత్తుకోలేని స్థితిని మాత్రం జూనియర్ ఎన్టీయార్ అభిమానులు తీసుకొస్తున్నట్టే.! ఆ విషయం ‘అమిగోస్’ ప్రీ-రిలీజ్ వేడుకలో ఎన్టీయార్ ముఖ కవళికల్లో స్పష్టంగా కనిపించింది.
అవార్డుల జ్యూరీని ట్యాగ్ చేస్తూ, జూనియర్ ఎన్టీయార్ అభిమానులు చేసిన యాగీ.. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత జుగుప్సాకరం.