ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు ఇచ్చేందుకోసం ఉద్దేశించబడిన సంక్షేమ పథకంలో బాగంగా, బోల్డంత భూమిని సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు ముందస్తుగా భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేశారన్న ఆరోపణలున్నాయి.
కొన్ని చోట్ల అసలు భూములే దొరకలేదు. దాంతో, కొండల మీదా.. స్మశానాల్లోనూ పేదలకు ఇళ్ళ స్థలాల్ని ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. వాటిపై వివాదాలు నడుస్తున్నాయి. ఇంటి స్థలాలు, ఆపై ఇళ్ళు.. ఇదీ జగన్ సర్కారు చేసిన ‘ఇళ్ళ’ ప్రకటన తాలూకు సారాంశం.
సరే, పేదలకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసినా, అభినందించి తీరాల్సిందే. కానీ, ఇక్కడ పాలకుల చిత్తశుద్ధి ఏంటి.? అని ప్రశ్నించకుండా ఎలా వుండగలం.? పేదలకు ఇళ్ళ స్థలాల నిమిత్తం ప్రభుత్వం నానా తంటాలూ పడింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. భూముల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.
మరి, పెట్టుబడిదారులకు తక్కువ ధరకే భూముల్ని ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందిట.? ‘చౌక ధరలకే వేల ఎకరాలు..’ అంటోంది అధికార వైసీపీకి చెందిన అనుకూల మీడియా. త్వరలో విశాఖలో జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’ నేపథ్యంలో అధికార పార్టీ అనుకూల మీడియా తెరపైకి తెస్తున్న కథనాల్లో ‘చౌక ధరలకే భూముల లభ్యత’ అన్న అంశం అత్యంత కీలకమైనది.
అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమయ్యిందో ఇన్వెస్టర్లు తెలుసుకోకుండా రంగంలోకి దిగుతారా.? అసలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదని ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.? ‘నేను విశాఖకు వచ్చేస్తున్నా.. విశాఖే రాజధాని..’ అని ముఖ్యమంత్రి చెబితే సరిపోదు కదా.?
రాజధాని మార్పు అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళింది. సర్వోన్నత న్యాయస్థానంలో రాజధానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతోంది. ఆ విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జాప్యం చేసినన్నాళ్ళూ చేసి, ఇప్పుడు వేగంగా విచారణ చేసెయ్యాలంటూ ఏపీ సర్కారు, సుప్రీంకోర్టుని కోరితే కుదురుతుందా.?