జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు, ఆ చంద్రబాబు మీద కాకుండా, పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ముద్రగడ విషం చిమ్ముతున్నట్లు.?
పవన్ కళ్యాణ్‌ని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తానంటూ ముద్రగడ పద్మనాభం ప్రకటించేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తే ముద్రగడ పద్మనాభంకి వచ్చే లాభమేంటి.? కనీసం, వైసీపీ నుంచి ఆయన టిక్కెట్ కూడా దక్కించుకోలేకపోయారు. అలాంటప్పుడు, వైసీపీలో ముందు ముందు ఆయనకి ఏవో పదవులు వస్తాయనుకోవడం హాస్యాస్పదం.
ఒక్కటైతే వాస్తవం. ముద్రగడ పద్మనాభం, కాపు సామాజిక వర్గంలో తన ఇమేజ్ పూర్తిగా కోల్పోయారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాస్తా, వైసీపీలో అనామకుడైన ముద్రగడ పద్మనాభంగా మారిపోయారు. పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే తప్ప, వైసీపీ అనుకూల మీడియా ముద్రగడ పద్మనాభం వైపు చూసే పరిస్థితే వుండదు.
మొత్తంగా పిఠాపురం నియోజకవర్గం మీదనే ముద్రగడ పద్మనాభం ఫోకస్ పెట్టబోతున్నారనడం ఇంకా పెద్ద కామెడీ.! పిఠాపురంలోని అన్ని వీధుల్లోనూ ముద్రగడ పద్మనాభం తిరుగుతారట.. గడప గడపకీ వెళ్తారట, పవన్ కళ్యాణ్‌ని ఓడించమని.
పిఠాపురంలో జనం ఇప్పటికే డిసైడ్ అయ్యారు, పవన్ కళ్యాణ్‌ని బంపర్ మెజార్టీతో గెలిపించాలని. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకే పిఠాపురంలో సీటు దక్కని పరిస్థితి. కాకినాడ ఎంపీ వంగా గీతని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ దించిందంటే, పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ముద్రగడ పద్మనాభం, పవన్ కళ్యాణ్ మీద చేసే ప్రతి విమర్శా, జనసేన పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప, ఆయన విమర్శల వల్ల పవన్ కళ్యాణ్‌కి కలిగే నష్టం ఇసుమంతైనా లేదు. కాకపోతే, వైసీపీ అనుకూల మీడియా, ముద్రగడ పద్మనాభంకి సహజంగానే ఓవర్ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ పోతుంటుంది.
జగన్‌కి సీఎం పదవి వుంది.. పవన్ కళ్యాణ్‌కి ఏం పదవి వుంది.? జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు.. పవన్ కళ్యాణ్ తండ్రికి రాజకీయాలతో ఏం సంబంధం వుంది.? పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి.? అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
కాపు సామాజిక వర్గానికి తానే పెద్దనని చెప్పుకుంటున్న ముద్రగడ, తనంతట తానుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైన విషయాన్ని కాపు సామాజిక వర్గం గమనిస్తోంది. కనీసం టిక్కెట్టు కూడా తెచ్చుకోలేని ముద్రగడ, ‘కాపు ఉద్యమ నేత’ ఎలా అవుతారు.? అన్న ప్రశ్న కాపు యువతలో వ్యక్తమవుతోంది.
అందుకే, పవన్ కళ్యాణ్ మీద ముద్రగడ చేసే ప్రతి విమర్శా, కాపు యువతలో ఆగ్రహావేశాల్ని రగుల్చుతోంది. అది జనసేనకు అనుకూలంగా ఓటు పడేలా చేస్తుందన్నది నిర్వివాదాంశం.