హీరోలెప్పుడూ కలిసి మెలిసే వుంటారు. అభిమానులే అత్యుత్సాహం చూపిస్తారు.. కొట్టుకు ఛస్తారు.! ఇది తరచూ అగ్ర హీరోల సినిమాల విడుదల విషయంలో జరిగే చర్చే. చిత్రమేంటంటే మెగా కాంపౌండ్ హీరోల అభిమానుల మధ్య కూడా ఇటీవలి కాలంలో అనవసరమైన రాద్ధాంతం జరుగుతోంది.
కాస్త లోతుగా ఈ వ్యవహారంపై విశ్లేషణ చేస్తే, సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లు సినీ సెలబ్రిటీల అభిమానులకు సంబంధించి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదీ అసలు సమస్య. అక్కడి నుంచే వివాదం మొదలవుతోంది. పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టకున్న ఓ నెటిజన్, అల్లు అర్జున్ మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేస్తాడు.
ఇంకేముంది.? అల్లు అర్జున్ అభిమానులు ముందూ వెనుకా చూసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద మాటల దాడికి దిగుతారు. పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ మధ్య గొడవలేమీ వుండవ్. అభిమానులే కొట్టుకు ఛస్తారు. అదీ అసలు సంగతి.
ఇప్పుడీ చర్చ ఎందుకంటే, మెగా అభిమానులంతా ఒక్కతాటిపైకొచ్చారు, జనసేన పార్టీని గెలిపించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. మరి, అల్లు అర్జున్ అభిమానులెక్కడ.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. మెగా అభిమానులంటే అందులో అల్లు అర్జున్ అభిమానులు కూడా.. అని మెగా ఫ్యాన్స్ తరఫున స్వామినాయుడు సహా పలువురు అభిమాన సంఘాల నాయకులు చెబుతున్నారు.
చిరంజీవి అభిమానిగా చెప్పుకొంటున్న భవానీ రవికుమార్ అనే వ్యక్తి, అల్లు అర్జున్‌కి మెగా అభిమానిగా మద్దతిచ్చేది లేదంటూ ఓ సందర్భంలో మాట్లాడితే, ఆ వీడియోకి కౌంటర్ ఎటాక్ అల్లు అర్జున్ అభిమానుల రూపంలో వచ్చింది. మెగా కాంపౌండ్ మీద సదరు అల్లు అర్జున్ అభిమాని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇదంతా ‘ఆర్గనైజ్డ్ క్రైమ్’ అన్న కోణంలో నిఖార్సయిన అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. జనసేన పార్టీని దెబ్బ తీసేందుకు ఇలాంటివి చాలానే జరిగాయి. ఎప్పుడైతే, మెగా అభిమానులంతా ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారో.. మళ్ళీ ఆ అభిమానుల మధ్య చిచ్చుపెట్టేందుకు కొన్ని శక్తులు నడుం బిగించినట్లే కనిపిస్తున్నాయి.
మరి, అభిమాన సంఘాల నాయకులు ఏం చేస్తున్నట్లు.? హీరోల మధ్య సఖ్యత గురించి ఎందుకు వివరించి చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడమంటే అభిమానుల మీద అభిమాన సంఘాల నాయకులకు అదుపు లేకపోవడమే కారణం కావొచ్చు.
ముందంటూ అభిమానులు సంయమనం పాటించకపోతే, ఆయా హీరోలకే మచ్చ తెచ్చినట్లవుతుంది. మెగా కాంపౌండ్‌లో ఏ హీరో కూడా, ఏ ఇతర హీరోని కించపర్చమని తన అభిమానులకు చెప్పడు. అభిమానుల ముసుగులో కొందరు చేసే వెకిలి వ్యాఖ్యల వల్ల అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయాల పరంగా మెగా కుటుంబానికి నష్టమే జరుగుతోంది.