సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా గత నెల ఆంధ్రాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. అయితే ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ సినిమాను ఆంధ్రా లో విడుదల చేయడం కుదరదంటూ ఎన్నికల కమిషన్ చెప్పింది. దాంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తరువాత వర్మ కోర్టుకు కూడా వెళ్లిన లాభం లేకుండా పోయింది.
నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మి పార్వతి ఎంట్రీ ఇచ్చిన తరువాత జరిగిన సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమాలో చంద్రబాబును నెగిటివ్ పాత్రలో చుపించారంటూ ఏపీలో పెద్ద దుమారమే రేగింది. అందుకే ఈ సినిమాను అక్కడ విడుదల చేయనీయలేదని విమర్శలు వచ్చాయి. మొత్తానికి ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్టు టీమ్ తెలిపింది.
లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా తెలంగాణతో పాటు ఓవర్సీస్ లో కూడా విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ సినిమా విషయంలో ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. సినిమా మొత్తం లక్ష్మి పార్వతి నేపథ్యంలోనే సాగుతుందని, కావాలనే చంద్రబాబు ను నెగిటివ్ చుపించే ప్రయత్నం చేసారని విమర్శలు వచ్చాయి. లక్ష్మి పార్వతిని కావాలనే హీరోను చేసారంటూ గుసగుసలు వినిపించాయి. దాంతో సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఆంధ్రా ప్రేక్షకులు ఈ సినిమా పై కాస్త ఆసక్తిగానే ఉన్నారని అందుకే భారీగానే విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఇప్పటికే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాలు ఏపీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
