జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తప్ప, బీసీలకు రిజర్వేషన్ లేదు. మహిళా కోటా విషయమై చాలాకాలంగా పోరాటాలు నడుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి, కమ్మ, వెలమ సామాజిక వర్గాలకు రాజకీయాల్లో అగ్ర తాంబూలం దక్కుతోందన్నది నిర్వివాదాంశం. కాపు సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా ప్రధాన రాజకీయ పార్టీలు చూస్తున్న వైనమూ కనిపిస్తోంది.
క్షత్రియ సామాజిక వర్గం విషయానికొస్తే, జనాభా శాతానికి మించి, కొందరు క్షత్రియ సామాజిక వర్గ నేతలు సీట్లు దక్కించుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి, క్షత్రియ సామాజిక వర్గం నాయకులకు దక్కిన సీట్లు, ఆయా నేతలకు తమ తమ నియోజకవర్గాల్లో వున్న క్షత్రియ ఓటు బ్యాంకు వివరాల్ని ఒక్కసారి పరిశీలిస్తే, ఆసక్తికరమైన గణాంకాలు కనిపిస్తాయి.
విశాఖపట్నం నార్త్ నుంచి కన్నప్పరాజు వైసీపీ నుంచి బరిలో వున్నారు. ఈ నియోజకవర్గంలో క్షత్రియ ఓటు బ్యాంకు దాదాపు 20 వేలుగా వుంది. యలమంచిలో కన్నబాబురాజుకి నాలుగు వేల క్షత్రియ సామాజిక వర్గం ఓటు బ్యాంకు వుంది. ఇది మొత్తం ఓటు బ్యాంకు. ఒక సామాజిక వర్గమంతా ఒకే పార్టీకి ఓటేస్తుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఆచంట నియోజకవర్గంలో చెరుకువాడ రంగనాత రాజు, నర్సాపురం నుంచి ముదునూరి ప్రసాదరాజు, ఉండి నరసింహరాజు తదితరులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి బరిలో వున్నారు. వీరంతా వైసీపీ నాయకులే. కూటమి విషయానికొస్తే, విజయనగరం నుంచి పూసపాటి అదితి, విశాఖపట్నం నార్త్ నుంచి పెనుమత్స విష్ణువర్ధన్ రాజు, చోడవరం నుంచి కలిదిండి రాజు బరిలో వున్నారు.
అనపర్తి శివకృష్ణంరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు (దాదాపు 12 వేల క్షత్రియ సామాజిక వర్గ ఓట్లున్నాయి ఇక్కడ), ఉండి మంతెన రామరాజు (దాదాపు పది వేల ఓట్లు), ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు (దాదాపు 12 వేల ఓట్లు), బాపట్ల వేగేశ్న నరేంద్ వర్మ తదితరులు ఎన్నికల బరిలో వున్నారు.
మొత్తంగా అన్ని పార్టీల నుంచి 11 నియోజకవర్గాల్లో 13 మంది అభ్యర్థులు క్షత్రియ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువగా.. అంటే, 2,500 కంటే కూడా తక్కువే వున్నాయ్. అయినా, ఆయా నియోజకవర్గాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా పట్టుంది. ఆర్థికంగా బలంగా వున్న అభ్యర్థులనే కాదు, స్థానికంగా మంచి పేరు, పలుకుబడి కూడా కొందరు నేతలకు బాగా కలిసొస్తోంది.
ఒక్కో అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్‌లో చూపించే మొత్తం కంటే దాదాపు పది రెట్లు వాస్తవ ఆస్తులు కలిగి వున్నట్లుగా ఆయా నియోజకవర్గాల్లోనే ప్రజలు చర్చించుకుంటుండడం గమనార్హం. ఈ లెక్కన వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్నారన్నమాట.
రఘురామకృష్ణరాజు లాంటోళ్ళయితే, పది మంది వరకూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు సైతం భరించేలా రాజకీయాలు చేయగలిగే సత్తా వున్నోళ్ళే.
అందుకే, ప్రజాస్వామ్యంలోనూ రాజులున్నారన్న అభిప్రాయాలు తరచూ తెరపైకి వస్తుంటాయి. తమ స్టామినాకి ఇంకా రాజకీయాల్లో మెరుగైన గౌరవం దక్కాల్సి వుందని క్షత్రియ సామాజిక వర్గ నేతలు తరచూ వాదిస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.