తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం తన నెక్ట్స్ భారీ ప్రాజెక్ట్ ‘ఇండియన్-2’ను పట్టాలెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ఇటీవల కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో కమల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇంతలోనే వారిని ఉలిక్కిపడేలా చేసింది ఓ వార్త. కమల్ హాసన్ అస్వస్థతకు గురికావడంతో, ఆయన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారనే వార్తతో కోలీవుడ్, టాలీవుడ్ అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కమల్ కాస్త అస్వస్థతకు గురవ్వడంతో ఆయన్ను చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో జాయిన్ చేశారు. అయితే ఆయనకు జ్వరం, జలుబు, దగ్గు కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. దీంతో అసలు కమల్ హాసన్‌కు ఏమైంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే టెన్షన్ అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది. కాగా, తాజాగా కమల్ హాసన్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను డాక్టర్లు విడుదల చేశారు. ఆయన స్వల్ప అస్వస్థతకు మాత్రమే గురయ్యారని, ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.
ఈ ప్రకటనతో కమల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోకు ఏమయ్యిందనే టెన్షన్‌తో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయనకు పెద్దగా ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తెలపడం.. ఒకట్రెండు రోజుల్లోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో వెంటనే కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వారు భగవంతుడిని కోరుతున్నారు. ఇక ఇండియన్-2 సినిమాలో కమల్ మరోసారి మసలాయన పాత్రలో నటించి మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.