నిరుద్యోగం.. ఏ ప్రభుత్వానికైనా సవాల్. అలాంటిది, అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు తిరగకుండానే లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్ సర్కార్, సంబంధిత విభాగాల్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 1,26,728 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం, పరీక్షలు నిర్వహించడం మాత్రమే కాదు.. పరీక్షా ఫలితాల్ని కూడా వెల్లడించడం గమనార్హం.
కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, మరికొన్ని ధైర్యవంతమైన నిర్ణయాలతో వైఎస్ జగన్ పాలన ఒడిదుడుకుల మధ్య సాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వార్డు, గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ, వైఎస్ జగన్ సర్కార్‌కి అతి పెద్ద ‘ప్లస్ పాయింట్’గానే చెప్పుకోవాల్సి వుంటుంది. అక్టోబర్ 2 నుంచి వార్డు, గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. 15 వేల రూపాయల ప్రారంభ జీతంతో ఈ ఉద్యోగాల కల్పనకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టింది. మరోపక్క ఇప్పటికే గ్రామ వాలంటీర్లు సేవలందిస్తోన్న విషయం విదితమే.
గ్రామ వాలంటీర్లనగానే వైఎస్సార్సీపీ కార్యకర్తలేనన్న అభిప్రాయం ఓ పక్క వున్నా, వార్డు – గ్రామ సచివాలయ ఉద్యోగుల వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం పూర్తి పారదర్శకతతోనే వ్యవహరించినట్లు తెలుస్తోంది. పరీక్షా ఫలితాలతో తీపి కబురు చెప్పిన వైఎస్ జగన్ సర్కార్, వారికి నియామక పత్రాలు అందించి, విధుల్లో చేర్చడం.. అనే కీలకమైన ఘట్టాన్ని పూర్తి చేయాల్సి వుంటుంది. ఈ ఉద్యోగాలతో ప్రజలు కలిగే మేలు ఏంటి.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నిరుద్యోగులకు మాత్రం ఈ ఉద్యోగాలు కొండంత అండగా మారుతాయన్నది నిర్వివాదాంశం. రాజకీయంగా వైఎస్సార్సీపీకి ఇది ఇటీవలి కాలంలో అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
