రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జలవిహార్ లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..
‘లాయర్ గా మొదలైన యశ్వంత్ సిన్హా ప్రస్థానం రాజకీయాల్లో ఉన్నత పదవులు అధిరోహించే వరకూ వెళ్లింది. భారత రాజకీయాల్లో ఆయన పాత్ర కీలకం. ఉన్నత వ్యక్తిత్వం, అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉంది. ఆత్మప్రభోదానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలి. ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ఖ్యాతి మరింతగా పెరుగుతుంది’.
‘ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మోదీ ఇచ్చిన హామీల్లో టార్చిలైట్ వేసి వెతికినా ఒక్కటీ నెరవేరినట్టు కనిపించవు. వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులతో సహా ప్రతిఒక్కరూ ఇబ్బందిపడుతున్నారు. దేశ ప్రధానిగా కాకుండా సేల్స్‌మెన్‌గా మోదీ వ్యవహరిస్తున్నారు. అధికారంలో శాస్వతంగా ఉంటానని భావిస్తున్నట్టున్నారు.. మార్పు వస్తుంది’ అని అన్నారు.