హైదరాబాద్ నగరం కమలదళంతో నిండిపోయింది. హెచ్ఐసీసీ వేదికగా రెండు రోజులపాటు జరుగబోతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలో సమావేశాల్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 352 మంది ప్రతినిధులు కూడా పాల్గొంటారు.
సమావేశాల్లో దేశంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు. పార్టీ చేయబోయే రాజకీయ తీర్మానాలు, మోదీ 8ఏళ్ల పాలనలోని ప్రధాన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు తెరదించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా సమావేశాల్లో చర్చించనున్నారు.
విజయ సంకల్ప సభా వేదిక పరేడ్ గ్రౌండ్స్ లో భారీ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భారీ సౌండ్ సిస్టమ్, 200 సీసీ కెమెరాలు, 30 చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా 10వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.