కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, అమరావతిపై పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారట. ‘అమరావతికి బీజేపీ మద్దతిస్తుంది.. అమరావతి ఉద్యమంలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలి. రైతులు చేపడుతున్న ఈ ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు వుంటుంది..’ అన్నది పార్టీ ముఖ్య నేతలకు అమిత్ షా చేసిన దిశా నిర్దేశం తాలూకు సారాంశమట.
నిజమైతే ఎంత బావుండు.? అన్న భావన అమరావతి రైతుల్లోనూ వుంటుంది. కానీ, బీజేపీని అమరావతి పరిరక్షణ సమితి నమ్మే పరిస్థితుల్లో లేదు. నిజానికి, అమరావతికి బీజేపీ మద్దతు.. అంటే, రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరు. ఎందుకంటే, బీజేపీ విధానం, కర్నూలులో హైకోర్టు వుండాలని. అంటే, అది ఏకైక రాజధాని అమరావతి అనే కాన్సప్టుకి విరుద్ధం.
అయితే, బీజేపీ ఎప్పుడూ మాట మీద నిలబడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తొలుత నినదించింది బీజేపీనే. ఆ ప్రత్యేక హోదాకి పాతరేసింది కూడా బీజేపీనే. అమరావతికి తొలుత బీజేపీ జైకొట్టింది.. ఆ తర్వాత కర్నూలులో హైకోర్టు.. అంటూ ఆ ఏకైక రాజధాని అమరావతికి తూట్లు పొడిచిన ఘనత కూడా బీజేపీకే దక్కతుంది.
అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అమరావతికి మద్దతు పలకడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. బీజేపీలోని టీడీపీ సానుభూతిపరులైన నేతలు ఈ లీకుని మీడియాకి అందించారన్న చర్చ కూడా జరుగుతోంది.
వాస్తవానికి ఏపీ బీజేపీ గతంలోనే అమరావతికి సంపూర్ణ మద్దతిచ్చింది. కానీ, కేంద్రం.. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేననీ, రాష్ట్రానికి రాజధాని విషయమై పూర్తి హక్కు రాష్ట్రాలకు వుంటుందని గతంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం విదితమే. అంటే, బీజేపీ అమరావతి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందన్నమాట.