బాబోయ్.. ఇదేం టాస్క్ మహాప్రభో.! అది కూడా టిక్కెట్ టు ఫినాలె కోసం జరిగిన టాస్క్. ఇందులో కంటెస్టెంట్లు ఎంత సీరియస్‌గా పాల్గొనాలి.? కానీ, అందరికీ నీరసమొచ్చేసింది. నీరసం అని కూడా కాదు, ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ వుందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, పూర్తి స్థాయి నిర్లక్ష్యం కంటెస్టెంట్లలో కనిపించింది. టాస్క్ కూడా అంత చెత్తగా ఇచ్చాడు బిగ్ బాస్.
టాస్కుని బట్టి కంటెస్టెంట్లు.. కంటెస్టెంట్లని బట్టి ఆట.! ఫినాలె దగ్గర పడుతోందంటే ఎంత హంగామా వుండాలి.? ఏమీ లేదు. అంతా తుస్.! అంతా హంబక్. కంటెస్టెంట్లు ఎందుకు పరుగులు పెడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. స్నో మాన్ తయారీ కోసం సంబంధిత పార్టులు జత చేయాలి.. అవి సమయానుసారం బిగ్ బాస్ హౌస్‌లోకి పంపడం చేస్తుంటాడు.
ఏదో నడిచింది.. తొలుత శ్రీ సత్య ఔట్ అయ్యింది.. ఆ తర్వాత ఇనాయా, కీర్తి ఔట్ అయ్యారు. ఇదీ నేటి ఎపిసోడ్ సారాంశం. అంతకు ముందు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారు. అదో పెద్ద సోది వ్యవహారం. ‘ఈసారి గెలవాలి.. నీ చేతిలో ఓడిపోతే, ఆడదాని చేతిలో ఓడిపోయానని నా మీద నా పెళ్ళాం విరుచుకుపడుతుంది..’ అంటూ ఆదిరెడ్డి స్నో మ్యాన్ టాస్క్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆటలోని ‘సిల్లీ థింగ్’ గురించి చెప్పకనే చెప్పేశాయి.
మరోపక్క, ఇనాయా – శ్రీహాన్ మధ్య ‘స్నో మ్యాన్ పార్టుల కోసం’ దాడి జరగాల్సి వుండగా, దాన్నొక రొమాంటిక్ ట్రాక్‌లా మార్చేశారు. టాస్క్ ముగిశాక.. శ్రీ సత్య, ఫైమా, రేవంత్.. చేసిన కామెడీ.. అదీ శ్రీహాన్ – ఇనాయా మీద చేసిన కామెడీ వేరే లెవల్ చిరాకు పుట్టించింది.
శ్రీహాన్‌కి ఇనాయాని టచ్ చేస్తే షాక్ కొట్టిందట. అంతే, ‘మగధీర’ సినిమాని గుర్తు చేసేసుకున్నారు. ఇనాయాని ఐటమ్ బాంబ్ అని శ్రీసత్య వెటకారం చేస్తే కాదు కాదు, శ్రీసత్యనే ఐటమ్ బాంబ్ అనేశాడు శ్రీహాన్. ‘సిరీ జాగ్రత్త..’ అంటూ సెటైరేసింది శ్రీసత్య.
ఇందుకే బిగ్ బాస్ అంటే ఈసారి ఆడియన్స్‌కి బొత్తిగా చిరాకు కలుగుతోంది.