ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు.. ఎన్నాళ్ళుంటుందో కూడా తెలియదు. ఇప్పుడన్నీ తాత్కాలికమైన ప్రేమలే. అభిప్రాయ బేధాలు చాలా త్వరగానే పుట్టుకొచ్చేస్తున్నాయి. ‘ఎంతలా ప్రేమించావు? అన్న ప్రశ్న కంటే, ఎన్ని రోజులు ప్రేమించగలవు?’ అని మాత్రమే అనుకునే రోజులివి. హీరోయిన్ శృతిహాసన్, తన ప్రియుడితో ‘బ్రేకప్’ అయిపోయింది. మైకేల్ కోర్స్‌లేతో గత కొన్నాళ్ళుగా ప్రేమాయణంలో వుంది శృతిహాసన్. అతని కోసమే సినిమాల్నీ వదులుకుంది. ఇద్దరూ కొన్నాళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. ‘పెళ్ళి’ ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ శృతిహాసన్, మీడియా మీద కస్సుమంటోంది.
అన్నట్టు, శృతిహాసన్ తండ్రి కమల్‌హాసన్‌కి కూడా వైవాహిక బంధం మీద ‘సదభిప్రాయం’ లేదు. అందుకే, ఆయన మొదటి భార్యతో విడిపోయాడు. ఒకప్పటి హీరోయిన్ గౌతమితో కొంతకాలం సహజీవనం చేశాడు. గౌతమితో కమల్ బ్రేకప్ అయిపోయింది కూడా. ఆ బ్రేకప్‌కి శృతిహాసనే కారణమని అప్పట్లో గట్టి ప్రచారమే జరిగింది. శృతి – మైఖేల్ ప్రేమ వ్యవహారంలో గౌతమి తలదూర్చిందనీ, అందుకే కమల్, శృతి కలిసి గౌతమిని పక్కన పెట్టేశారనీ కొందరు అంటుంటారు. కారణాలేవైతేనేం కమల్ – గౌతమి విడిపోయారు.. శృతి – మైఖేల్ కొన్నాళ్ళు ప్రేమలో మునిగి తేలారు.. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయారు.
ఇదిలా వుంటే, విడిపోవాలనే నిర్ణయానికి వచ్చిన శృతి, మళ్ళీ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంది. నిజానికి రెండు మూడు నెలల క్రితమే శృతి – మైఖేల్ విడిపోయారట. అయితే, ఆ విషయాన్ని కాస్త గోప్యంగా వుంచారు. ఈలోగా శృతిహాసన్ ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. అదే విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కుతోన్న సినిమా. తెలుగు నిర్మాతలకు సైతం ‘నేను మళ్ళీ సినిమాల్లో నటించబోతున్నాను..’ అని సంకేతాలు పంపిందట శృతి హాసన్.
నిజానికి సినీ జనాలకి లవ్, బ్రేకప్ అనేవి పెద్ద విషయాలే కావు. త్రిష ప్రేమ వ్యవహారం పెళ్ళి పీటలదాకా వెళ్ళినా.. వైవాహిక బంధం వరకూ వెళ్ళలేకపోయింది. అమలా పాల్ సంగతి తెలుసు కదా! పెళ్ళి చేసుకుని, ఆ వైవాహిక బంధాన్ని తెంచేసుకుంది. నయనతారకీ కొన్ని లవ్ స్టోరీస్ వున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో తాజా లవ్ స్టోరీని వైవాహిక బంధంగా మార్చడానికి నయనతార సుముఖత వ్యక్తం చేయడంలేదు. దాంతో, నయనతార ఆమె ప్రియుడు విఘ్నేష్ ‘సహజీవనానికే’ పరిమితమయ్యారు. అంజలి కూడా కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపింది ‘జై’ అనే తమిళ నటుడితో.
సో, శృతిహాసన్ బ్రేకప్ స్టోరీ పెద్దగా ఎవరికీ ‘షాకింగ్’ అనిపించలేదు. అయితే, ఎందుకు ఈ ఇద్దరూ విడిపోయారన్న చర్చ అయితే కొంత జరుగుతున్న మాట వాస్తవం. తన బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకి సంప్రదాయ దుస్తుల్లో మైఖేల్‌ని తీసుకెళ్ళిన శృతిహాసన్, అతనితో వైవాహిక బంధం కష్టమనే నిర్ణయానికి ఎలా వచ్చింది.? ప్రేమకి అర్థాంతరంగా ఎలా ఫుల్ స్టాప్ పెట్టేసిందన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. ‘మా ఇద్దరి దారులూ వేరైపోయాయి. ఇక విడిగా ప్రయాణం చేస్తాం. మా స్నేహం మాత్రం అలాగే కొనసాగుతుంది’ అని మైఖేల్ కోర్సలే వెల్లడించాడు. శృతి కూడా ఇదే మాట చెబుతోంది.
స్నేహం కొనసాగుతుంది.. ఆ స్నేహం కారణంగా పుట్టుకొచ్చిన ప్రేమ మాత్రం అర్థాంతరంగా చచ్చిపోతుంది ఎందుకిలా? ఈ మధ్యనే టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటి కిమ్ శర్మతో బ్రేకప్ చేసుకున్నాడు. ‘బ్రేకప్’ విషయం వెల్లడిస్తూ, ‘స్నేహం’ కొనసాగుతుందని చెప్పడం కొత్త ఫ్యాషన్ అనుకోవాలేమో.
