Ram Charan: సీనియర్ ఎన్టీఆర్( Sr NTR)శతజయంతి వేడుకలు హైదరాబాదులో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్, మురళీమోహన్, జయసుధ, బోయపాటి శీను, అనిల్ రావిపూడి తదితరులు ఎన్టీఆర్ ని ఉద్దేశించి మాట్లాడారు.
రామ్ చరణ్ ( Ram Charan)మాట్లాడుతూ…’ షూటింగ్ సెట్ లో నాతో సహా ప్రతి ఒక్క నటుడు గుర్తుతెచ్చుకునే పేరు ఎన్టీఆర్. తెలుగు సినీ పరిశ్రమకు, భాషకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయనే. ఆయన వేసిన తెలుగు సినీ పరిశ్రమ బాటలో మనమంతా నడుస్తున్నందుకు గర్వపడాలి. నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన్ని ఒకే ఒకసారి వాళ్ళింట్లో కలిశాను. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వయంగా ఆయనే నాకు బ్రేక్ ఫాస్ట్ వడ్డించారు. నా జీవితంలో మర్చిపోలేని ఘటన అది’ అన్నారు.
బోయపాటి శీను మాట్లాడుతూ…’ ఎన్టీఆర్ తో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. కానీ ఆయనని చూసి చాలా విషయాల్లో స్ఫూర్తి పొందాను. ఒక నాయకుడు, ఓటరు ఎలా ఉండాలి? కొడుకు, తల్లి బంధం ఎలా ఉండాలి? అన్న విషయాలు కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ చేసి చూపించిన వ్యక్తి ఆయన ఒకరే. అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకొని భావి తరాలు స్ఫూర్తి పొందాలి ‘ అని అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ…’ ‘చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. 75 ఏళ్లుగా ఆయన మాట వింటూనే ఉన్నామంటే ఆయన చూపిన ఇంపాక్ట్ అలాంటిది. ఎన్నో కోట్ల మంది గుండెలపై ఆయన సంతకం చేసి వెళ్లిపోయారు. దర్శకుడిగా నా ప్రస్థానం మొదలైంది ఆయన పేరుతో ఉన్న నిర్మాణ సంస్థతోనే. నేను ఆయన్ని నేరుగా చూసే అదృష్టం లేకపోయినా అయన నట వారసుడు బాలకృష్ణ తో పనిచేసే అవకాశం దక్కింది’ అని అన్నారు.