ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు అనగానే, ‘ముక్కుసూటితనం’ అనే చర్చ తెరపైకొస్తుంటుంది. అలాగని ఆయనే ప్రచారం చేసుకుంటుంటారు. ఆయన ఎంత ముక్కుసూటితనం గల వ్యక్తి.. అంటే, ‘వైసీపీలో చేరలేదు, వైసీపీ తరఫున ప్రచారం మాత్రమే చేశాను’ అని చెప్పేంతలా.!
చిరంజీవితో విభేదాల్లేవు.. గిల్లికజ్జాలు మాత్రమే.. అని చెప్పేలా కూడా వుంటుంది మంచు మోహన్‌బాబు ముక్కుసూటితనం. ఈ మాత్రం దానికి ముక్కుసూటితనం అని చెప్పుకోవడమెందుకో.! క్రమశిక్షణ, ముక్కు సూటి తనం.. వీటన్నిటికీ తానే బ్రాండ్ అంబాసిడర్‌నని చెప్పుకు తిరుగుుంటారు మోహన్‌బాబు.. అన్న విమర్శ ఎప్పటినుంచో వుంది.
2019 ఎన్నికల సమయం అది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మోహన్‌బాబు. తన విద్యా సంస్థకు సంబంధించి ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ బకాయిల వ్యవహారంపై రోడ్డెక్కి ఆందోళనలు చేశారాయన. ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు.. వైసీపీలో చేరిన వైనం అందరికీ తెలిసిందే.
‘వైఎస్ జగన్ మా బావ..’ అని విష్ణు పదే పదే చెబుతుంటారు. 2019 ఎన్నికల్లో మోహన్‌బాబు వైసీపీ తరఫున ప్రచారం చేశారు కూడా. కానీ, ఇప్పుడేమో ‘నేనెప్పుడూ వైసీపీలో చేరలేదు. బంధుత్వం కారణంగా ప్రచారం మాత్రమే చేశాను’ అంటూ మోహన్‌బాబు చాలా ‘ముక్కుసూటితనం’తో, ‘క్రమశిక్షణ’తో చెప్పుకొచ్చారు.
పైగా, రాజకీయాలంటే తనకున్న ఏహ్యభావాన్ని కూడా వివరించారు. రాజకీయాల్లో అది దారుణం, ఇది దారుణం.. బంధాలు, బంధుత్వాలు ఏమీ వుండవ్.. ఇలా ఏవేవో చెప్పుకున్నారు మోహన్‌బాబు తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో. ఇవన్నీ, వైసీపీలో చేరే ముందు మోహన్‌బాబు ఆలోచించుకుని వుంటే బావుండేది.
టీటీడీ ఛైర్మన్ గిరీ, రాజ్యసభ సభ్యత్వం.. వీటిపై మోహన్ బాబు ఒకింత ఆశపడ్డారు. కానీ, అనుకున్నది జరగలేదు. అలీ, పోసాని లాంటోళ్ళకు పదవులు ఇచ్చిన వైఎస్ జగన్, మోహన్‌బాబుని లైట్ తీసుకున్నారాయె. ఆ కారణంగా మోహన్ బాబులో వచ్చిన వైరాగ్యం వల్ల.. ‘అబ్బే, వైసీపీలో చేరలేదు’ అని చెప్పుకోవాల్సి వస్తున్నట్టుంది.