వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సినిమా మహానటులు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులను ఉద్దేశించి.. ‘ఆ రంగారావు.. అక్కినేని.. తొక్కినేని’ అనే వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పటికే అక్కినేని అభిమానులు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు.. బాలకృష్ణకు, టీడీపీకి కాపునాడు అల్టిమేటం ఇచ్చారు. ఎస్వీ రంగారావును ఉద్దేశించి ‘ఆ రంగారావు.. ఈ రంగారావు’ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్వీ రంగారావుపై బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని.. ఈనెల 25లోపు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. దీంతో పరిస్థితులు తీవ్ర ఉత్కంఠకు దారి తీసాయి. అటు అక్కినేని కుటుంబం, ఫ్యాన్స్, ఇటు కాపునాడు నేతల డిమాండ్లపై బాలకృష్ణ స్పందిస్తారా.. లేదా అనేది చూడాలి.