ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ‘వారాహి’ వాహనం అడుగు పెట్టబోతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనల కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ‘వారాహి’ వాహనానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ పూజల్లో పాల్గొని, వారాహి వాహనం పైకెక్కి తొలి ప్రసంగం చేశారు. అనంతరం అక్కడి నుంచి ధర్మపురి వెళ్ళారు. బుధవారం విజయవాడలో పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.
బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా, ‘వారాహి’ వాహనానికి అసలంటూ రిజిస్ట్రేషన్ జరగదంటూ ఏపీకి చెందిన పలువురు మంత్రులు శపథాలు చేసేశారు.. కామెడీ అయిపోయారు. ఎందుకంటే, ఆ వాహనానికి అప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిపోయింది. అది తెలియక నానా యాగీ చేసి అభాసుపాలయ్యారు వైసీపీ నేతలు, మంత్రులు.
‘తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అనుమతిస్తాం.?’ అంటూ మళ్ళీ మంత్రులు కొత్త పాట పాడారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ‘వారాహి’ వాహనాన్ని తిరగనియ్యబోమన్నారు. ఏపీలో అసలు ‘వారాహి’ వాహనాన్ని అడుగుపెట్టనీయబోమంటూ పలువురు వైసీపీ నేతలు హడావిడి చేశారు.
మరి, ఆ వైసీపీ నేతలు ఇప్పుడేం చేస్తారు.? తెలంగాణ సరిహద్దుల్లో వారాహి వాహనాన్ని అడ్డుకోగలరా.? ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో వున్న కనకదుర్గ దేవస్థానంలో ‘వారాహి’కి ప్రత్యేక పూజలు నిర్వహించనుండడమంటే.. ఇదీ జనసేనాని ‘పవర్’.!