అమెరికా.. ఇది చాలామందికి కలల ప్రపంచం.! ఔను, జీవితంలో స్థిరపడాలంటే, అమెరికా వెళ్ళాల్సిందే.. అనుకుంటోంది నేటి యువత.! ఉన్నత చదువుల కోసం కావొచ్చు.. ఉన్నతమైన ఉద్యోగం కోసం కావొచ్చు.. అమెరికా వైపే నేటి యువత చూస్తోంది.
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అమెరికా వెళుతున్నవారితో పోల్చితే, భారతీయులది.. అందునా, తెలుగువారిది ఇంకాస్త ప్రత్యేకమైన స్థానం అని చెప్పొచ్చు. అమెరికాలో నల్లజాతి – తెల్లజాతి మధ్య పోరు ఈనాటిది కాదు. జాతి వివక్ష అక్కడ వేళ్ళూనుకునిపోయింది. అదిప్పుడు మరింత దారుణమైన పరిస్థితులకు కారణమవుతోంది.
భద్రత పరంగా అమెరికాని కొందరు ‘సేఫెస్ట్’ కంట్రీ అంటుంటారు. కానీ, అక్కడా దారుణాలు చోటు చేసుకుంటాయ్. బయటకు వెళితే, ప్రాణంతో తిరిగొస్తామన్న నమ్మకం లేదు. ఈ మధ్యకాలంలో భారతీయ యువతను టార్గెట్‌గా చేసుకుని అమెరికాలో కొందరు దుండగులు హత్యా కాండకు తెరలేపుతున్నారు.
మొబైల్ ఫోన్లు, ఆభరణాలు, డబ్బులు.. వీటి కోసం హత్యలు జరుగుతున్నాయక్కడ. పెట్రోల్ బంకుల్లోనూ, రెస్టారెంట్లలోనూ ‘పార్ట్ టైమ్ వర్క్’ చేస్తున్నవారే ఎక్కువగా బలైపోతున్నారు. ఎవరైనా తుపాకులతో బెదిరిస్తే, హీరోయిజం ప్రదర్శించొద్దంటూ అమెరికాలోని తెలుగు సంఘాలు మన తెలుగు యువతకు సూచిస్తున్నాయి.
‘ప్రాణాలు ముఖ్యం.. ముందైతే వాళ్ళు అడిగినవి ఇచ్చెయ్యండి.. వీలైనంతవరకు జనసంచారం తక్కువగా వున్న చోట్లకు వెళ్ళొద్దు..’ అని కూడా సూచిస్తున్నారు. పని ప్రాంతాలు.. అంటే, పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంట్లలో పని చేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ చెబుతున్నారు.
ఖర్చుల భారం నేపథ్యంలో నగరాలకు దూరంగా వుంటున్నవారికే ఈ ముప్పు ఎక్కువగా వుంటోంది.