న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ కీ ఫ్యాక్టర్ గా రూపొందిన ఈ సినిమా మరి ఎలా ఉందో చూద్దామా?
కథ:
విరాజ్ (నాని) తల్లి లేని తన ఆరేళ్ళ కూతురు మహి (కియారా ఖన్నా)కు అన్నీ తానై చూసుకుంటూ ఉంటాడు. రోజూ పడుకునేటప్పుడు తమ జీవితంలో ఉన్న అందరినీ కలుపుతూ కథలు చెప్పడం విరాజ్ కు అలవాటు. అయితే అందులో మహి తల్లి మాత్రం ఉండదు. ఒకరోజు మహి, తన తల్లి గురించి చెప్పాల్సిందే అని గొడవ చేసినప్పుడు విరాజ్ తన ప్రేమకథ చెబుతాడు.
ఇంతకీ మహి తల్లి ఎవరు? విరాజ్ ప్రేమకథకు ఏమవుతుంది? ఈ మధ్యలో ఎష్ణ (మృణాల్ ఠాకూర్) పాత్రకున్న ప్రాధాన్యం ఏమిటి?
నటీనటులు:
ఎమోషనల్ సీన్స్ లో నాని ని మించిన నటుడు లేడంటే అతిశయోక్తిలా అనిపించదు. విరాజ్ గా తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటాడు నాని. రొమాంటిక్ పోర్షన్స్ లో కూడా నాని తన శైలితో మెప్పించాడు. ఇక మహి పాత్రలో చిన్నారి కియారా ఖన్నా అద్భుతంగా నటించింది. నాని, మృణాల్ ఠాకూర్ వంటి నటులు స్క్రీన్ మీద ఉన్నప్పుడు ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకోవడం నిజంగా అద్భుతమే.
మృణాల్ ఠాకూర్ కు కూడా సీతారామం తర్వాత మరో మంచి పాత్ర దక్కింది. చూడటానికి బాగుండే మృణాల్, అంతకంటే బాగా నటించింది ఈ చిత్రంలో. నానితో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ తల్లిగా నటించినామె పాత్రకు సరిపోలేదు. ఆమె డబ్బింగ్ కూడా సింక్ లో లేదు. హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి కూడా బాగా చేసాడు. జయరాం కూడా అంతే. శృతి హాసన్ స్పెషల్ పార్టీ సాంగ్ లో మెరిసింది.
ఇక నాజర్, రితిక నాయక్, దృష్టి తల్వార్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
సాంకేతిక నిపుణులు:
శౌర్యువ్ చెప్పిన కథ ఒకింత రొటీన్ గానే ఉందని చెప్పొచ్చు. చిరంజీవి నటించిన డాడీ సినిమా గుర్తొస్తుంది. సినిమా స్లో పేస్ లో నడవడం కూడా చిత్రానికి ఒకింత మైనస్ అయింది. మరోవైపు చిత్రానికి రాసిన సంభాషణలు బాగున్నాయి. చిత్రానికి ఎమోషనల్ డెప్త్ ఇవ్వడంలో సహాయపడ్డాయి.
ఇక ప్రెసెంటేషన్ పరంగా శౌర్యువ్ డీసెంట్ జాబ్ చేసాడు. చిత్రం మొత్తాన్ని ఒక క్లాస్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. హేశం అబ్దుల్ వాహబ్ ఫీల్ గుడ్ సాంగ్స్ ఇవ్వడంలో మేజర్ సక్సెస్ అయ్యాడు. పాటలన్నీ వినడానికి చాలా బాగున్నాయి. సాహిత్య విలువలు కూడా బలంగా ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా నిరాశపరచలేదు ఈ సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చన్న ఫీల్ వస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
నాని, కియారా ఖన్నా, మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మన్స్ లు
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎమోషనల్ సీన్స్
ఇంటర్వెల్, క్లైమాక్స్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
స్లో పేస్
వీక్ కాన్ఫ్లిక్ట్
విశ్లేషణ:
హాయ్ నాన్న ఒక స్లో పేస్ ఎమోషనల్ డ్రామా. పెర్ఫార్మన్స్ ల పరంగా, ఎమోషన్స్ పరంగా ఈ చిత్రం మెప్పిస్తుంది. ఈ టైపు సినిమాలు చూసేవారికి హాయ్ నాన్న నచ్చే అవకాశాలున్నాయి.
తెలుగు బులెటిన్.కామ్ రేటింగ్: 2.5/5