గత కొంత కాలంగా నితిన్ కు సరైన విజయం అన్నది లేదు. చేసిన సినిమాలు అన్నీ కూడా బోల్తా కొట్టినవే. ఈ నేపథ్యంలో వక్కంతం వంశీ దర్శకత్వంలో పూర్తి స్థాయి కామెడీ చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తో మన ముందుకి వచ్చాడు నితిన్. గోల్డెన్ లెగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
అభి (నితిన్) ఒక జూనియర్ ఆర్టిస్ట్. ఏరోజైనా హీరో అవ్వాలని కలలుకంటుంటాడు. ఇదిలా ఉండగా అభి, లిఖిత (శ్రీలీల)ను కలుసుకుని ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె కంపెనీకి సీఈఓ కూడా అవుతాడు. జీవితం అలా సాఫీగా సాగిపోతోన్న సమయంలో అభికి హీరోగా చేసే అవకాశం దక్కుతుంది. ఆ ఆఫర్ కు ఒప్పుకుని దానికోసం గట్టిగా కృషి చేస్తోన్న సమయంలో అనుకోని ట్విస్ట్ తన జీవితాన్ని మలుపు తిప్పుతాయి.
అభి బ్యాక్ స్టోరీ ఏంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది చిత్ర కథ.
నటీనటులు:
నితిన్ స్ట్రాంగ్ జోనర్ అంటే కామెడీ అనే చెప్పాలి. తన బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ కూడా కామెడీ ప్రధానంగా సాగిన చిత్రాలే. అయితే మధ్యమధ్యలో యాక్షన్ కలలు కని చేతులు కాల్చుకుని మళ్ళీ కామెడీ ఎంటర్టైనెర్స్ వైపు వస్తాడు నితిన్. ఇక ఎక్స్ట్రా లో జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ చంపేశాడనే చెప్పాలి. కొన్ని సీన్స్ లో పగలబడి నవ్వేలా చేస్తాడు. ఇక యాక్షన్ సీన్స్ లో కూడా తనకు తిరుగులేదు అని నిరూపించాడు.
శ్రీలీలకు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ దక్కింది. ఉన్నంతలో ఆమె బాగానే చేసింది. ఒక సాంగ్ లో తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ తో ఇంప్రెస్ చేసింది. ఇక చిన్న పాత్రలో రాజశేఖర్ మెరిశాడు. మున్ముందు మరిన్ని క్యారెక్టర్ రోల్స్ చేస్తే బాగుంటుంది. రావు రమేష్, రోహిణి స్క్రీన్ మీద కనిపించినంత సేపూ ఎంటర్టైన్ చేస్తారు. ఇక మెయిన్ విలన్ గా నటించిన సుదేవ్ నాయర్ ఇంప్రెస్ చేయడంలో విఫలమయ్యాడు. ఏదైనా తెలిసిన మొహం ఉండుంటే బాగుండేది.
ఇక హైపర్ ఆది, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, తదితరులు తన పాత్రల్లో ఇంప్రెస్ చేసారు.
సాంకేతిక వర్గం:
వక్కంతం వంశీ రాసుకున్న కథ చాలా ఆర్డినరీగా ఉంది. ఇలాంటి కథతో ఎక్స్ట్రా ఆర్డినరీ కథానాయకుడిని ఎలా చూపిద్దామనుకున్నాడో మరి. జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్ డ్రాప్, సెకండ్ హాఫ్ లో తీసుకున్న పాయింట్ కొత్తగా అనిపించినా దానికి రాసుకున్న ట్రీట్మెంట్ అంత కన్విన్సింగ్ గా లేదు. స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా కొంచెం రెగ్యులర్ గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్ బాగా పేలాయి. అయితే కొన్ని మాత్రం అవుట్ డేటెడ్ అనిపిస్తాయి. మొత్తంగా వక్కంతం వంశీ తన పనితనంతో ఓకే అనిపిస్తాడు. సంభాషణలు బాగున్నాయి.
ఆర్థర్ ఏ విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ మంచి క్వాలిటీతో ఉంది. ఒకప్పుడు తన మ్యూజిక్ తో మెస్మెరైజ్ చేసిన హారిస్ జయరాజ్ ఈసారి పూర్తిగా నిరుత్సాహపరిచాడు. అటు సాంగ్స్ పరంగా కానీ ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ హరీష్ పనితనం మెప్పించదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా యావరేజ్ అనొచ్చు. సెకండ్ హాఫ్ ఇంకా క్రిస్పీగా ఉండే అవకాశముంది. శ్రేష్ట్ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
- నితిన్, శ్రీలీల పెర్ఫార్మన్స్ లు
- శ్రీలీల డ్యాన్స్
- రావు రమేష్, రోహిణి కామెడీ సీన్స్
- ఓలే ఓలే పాపాయి సాంగ్
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్:
- బలమైన కథ లేకపోవడం
- రొటీన్ కామెడీ సీన్స్
- సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- విలన్ రోల్
- స్పూఫ్ లు ఎక్కువవ్వడం
విశ్లేషణ:
చాలా ఆర్డినరీ కథతో ఆర్డినరీ ట్రీట్మెంట్ తో తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మనకు మరీ ఆర్డినరీగా అనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ కోసమైతే ఒకసారి చూడవచ్చు.
తెలుగుబులెటిన్ రేటింగ్: 2.5/5