రాజకీయాల్లో విమర్శలు చేయడం అనేది అతి సాధారణమైన అంశం. విమర్శలేని రాజకీయాన్ని ఊహించలేం. ఎంత ఎక్కువ విమర్శలు చేస్తే అంతగా అధినేతల వద్ద మెప్పు పొందవచ్చునన్న భావనలో ఇతర నేతలుంటారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి ఈ విషయంలో అందరికన్నా రెండాకులు ఎక్కువే చదివినట్లున్నారు. వైఎస్ జగన్ మెప్పు కోసం విజయసాయిరెడ్డి పడుతున్న తాపత్రయం ఆ పార్టీ నేతలకు కూడా ఆశ్చర్యకరంగానే కన్పిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయసాయిరెడ్డి ఈ మధ్య ట్విట్టర్‌కే అధిక సమయం కేటాయిస్తున్నారు.
ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టడానికి వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిని ప్రత్యేకంగా నియమించిన సంగతి తెల్సిందే. కేంద్రంలోని అధికార బీజేపీతో తెరచాటు వ్యవహారాలు నడపడంలో విజయం సాధించి, వైసీపీకి – బీజేపీకి అనుసంధానకర్తంగా వ్యవహరిస్తూ వైఎస్ జగన్ మెప్పుని బాగానే పొందగలుగుతున్నారు విజయసాయిరెడ్డి. దానికి తోడు ఇటీవలి కాలంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ, జనసేనలపై విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలతో ఆయన తన ‘పొజిషన్’ని పార్టీలో ఇంకొంచెం బలోపేతం చేసుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది.
కానీ, ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు రాజకీయ ప్రత్యర్థుల నుంచే కాక, సామాన్యులనుంచి కూడా ప్రతిస్పందనలు చాలా గట్టిగా వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీబీఐ జేడీ, జనసేన నేత లక్ష్మినారాయణపై విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్ ఫైట్ నవ్వులపాలవుతోంది. విలవలు, విశ్వసనీయత గురించి పదే పదే వైఎస్ జగన్ మాట్లాడుతుంటారు. మరి, ఏ విలువలు, విశ్వసనీయతతో విజయసాయిరెడ్డి అడ్డగోలుగా సోషల్ మీడియాలో లక్ష్మినారాయణపై ఆరోపణలు చేస్తున్నారు?
తక్షణం వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి విషయంలో అప్రమత్తం కావాల్సి వుంది. లేకపోతే, విజయసాయిరెడ్డి ట్వీట్ల వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేసే అవకాశం వుంది. వైసీపీ సానుభూతి పరుల్లోనూ కొందరు, లక్ష్మినారాయణ పట్ల గౌరవభావంతో వున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుని లక్ష్మినారాయణ గతంలో డీల్ చేసిన సంగతి తెల్సిందే. జగన్ పట్ల గౌరవం వున్నవారు కూడా, లక్ష్మినారాయణ కార్యదక్షతను ప్రశ్నించలేరు. జగన్ మెప్పుకోసమే కొందరు వైసీపీ నేతలు, లక్ష్మినారాయణపై విమర్శలు చేయవచ్చుగాక. అయితే అది గతం.
అధికారులుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చినవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా వున్నారు. హిందూపురం లోక్‌సభకు పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్, రాజకీయాల్లోకి రాకముందు వైసీపీతో అంటకాగారని అనగలమా? లక్ష్మినారాయణ ఇంకా ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి. తొలుత విజయసాయిరెడ్డి చెత్త ట్వీట్లకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన లక్ష్మినారాయణ, ఆ తర్వాత అలా స్పందించడం కూడా అనవసరమని తెలుసుకున్నారు. తన స్థాయిని తగ్గించుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు.
అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, ఆ కేసుని డీల్ చేసిన అధికారిపై అడ్డగోలు విమర్శలు చేయడం, దిగజారిపోతున్న విలువలకు నిదర్శనంగా చెప్పుకోవాల్సి వుంటుంది. ఓ పార్టీ జెండా కప్పుకుంటే, పార్టీ అధినేత మెప్పు కోసం ఎలాగైనా మాట్లాడేస్తారా? ఈ అర్థం పర్థం లేని ట్వీట్లతో లక్ష్మినారాయణకు పెద్దగా నష్టం లేదు, వైసీపీ ప్రజల్లో చులకనవుతుందంతే. విజయసాయి రెడ్డిగారూ, మీరే వైసీపీలో ముంచేస్తున్నారు.! విజయసాయిరెడ్డి విషయంలో జర జాగ్రత్త జగన్ సారూ!
