తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తామే గెలిపించామని చెప్పుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.! ఇందులో నిజమెంత.? వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో టీడీపీ సంపూర్ణ మద్దతిచ్చినమాట వాస్తవం. అయితే, అదంతా అనధికారికం.
నిజానికి, కాంగ్రెస్ పార్టీకే కాదు, కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకూ స్థానిక టీడీపీ మద్దతిచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థులకేనా.? బీజేపీ అభ్యర్థులూ టీడీపీ మద్దతుని పొందారు కొన్ని నియోజకవర్గాల్లో. జనసేన పార్టీకి కూడా టీడీపీ మద్దతు లభించిందండోయ్.!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా వున్న టీడీపీ, చిత్ర విచిత్రంగా అన్ని రాజకీయ పార్టీలకూ ‘జెండా కూలీ’ తరహాలో వ్యవహరించాల్సి వచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఇంతా చేసి, టీడీపీ ఆయా అభ్యర్థుల జయాపజయాల్లో భాగం పంచుకుందా.? అంటే, ప్చ్.. లాభం లేదనే చెప్పాలేమో.!
‘సరికొత్త హైద్రాబాద్ నిర్మాణం నా వల్లే జరిగింది.. సైబరాబాద్ సృష్టికర్తని నేనే..’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘనంగా చెప్పుకుంటుంటారు. అలాంటి, గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో, టీడీపీ మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీకి దక్కిన సీట్లు గుండు సున్నా.
సో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ వల్ల ఒరిగిందేమీ లేదు. పోనీ, గులాబీ పార్టీకి ఏమన్నా టీడీపీ వల్ల ఉపయోగముందా.? అంటే, ప్చ్.. పెద్దగా లేదనే చెప్పాలి. ఈ విషయమై మీడియా వర్గాల్లో రకరకాల విశ్లేషణల్ని చూస్తున్నాం.
మావల్లే ఫలానా చోట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు.. మా వల్లే ఫలానా చోట్ల బీజేపీ అభ్యర్థి గెలిచాడు.. మా వల్లనే మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది.. అంటూ టీడీపీ మద్దతుదారులు అర్థం పర్థం లేని వాదనల్ని తెరపైకి తెస్తున్నారు. ఈ విషయంలో టీడీపీకి ఎలివేషన్లు ఇచ్చేందుకు టీడీపీ అనుకూల మీడియా పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.