పెద్దగా ఫామ్ లో లేని అక్కినేని నాగార్జున ఈసారి సంక్రాంతి పండగ అస్సలు మిస్ అవకూడదని ఆఘమేఘాల మీద షూట్ చేసిన చిత్రం నా సామి రంగ. కేవలం నాలుగే నెలల్లో ఈ చిత్రం పెద్ద పండగకు సిద్ధమైపోయింది. మరి అంతలా సంక్రాంతికే రావాలని పట్టుబట్టిన ఈ చిత్రం నిజంగా ఆ రేంజ్ లో ఉందా? జనాలను ఆకర్షించిందా?
కథ:
ఈ కథ 1980లలో మొదలవుతుంది. కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుండి స్నేహితులు, ఆనాధలు. కిష్టయ్య, ఆ ఊరి పెద్ద (నాజర్)కు విధేయుడిగా ఉంటాడు. ఒకరోజు వరాలు (ఆషిక రంగనాథ్)కు ఊరి పెద్ద చిన్న కొడుకుతో పెళ్లి చేయాలనీ నిశ్చయిస్తారు కానీ అప్పటికే ఆమె కిష్టయ్యతో ప్రేమలో ఉందని తెలుస్తుంది.
మరోవైపు ఆ రోజులో జరిగే జాతరకు పక్క ఊరితో సమస్య ఎదురవుతుంది. మరి కిష్టయ్య ఆ ఊరి సమస్యను ఎలా చేధించాడు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నది చిత్ర కథ.
నటీనటులు:
ఊరి నేపధ్యం, పండగ సినిమా అనగానే సోగ్గాడే చిన్ని నాయన చిత్రం గుర్తొస్తుంది. ఈ కోవలోనే తెరకెక్కిన చిత్రం నా సామి రంగ. కొంచెం కామెడీ, యాక్షన్, ఇలా అన్నీ సమపాళ్లలో రంగరించిన చిత్రం నా సామి రంగ. కిష్టయ్యగా నాగార్జున నటన అదిరింది. తన స్క్రీన్ ప్రెజన్స్ చాలా బాగుంది. అలాగే యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టాడు.
అంజి పాత్రలో అల్లరి నరేష్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తన కెరీర్ లో గుర్తించుకోదగ్గ పాత్రల్లో ఇది కూడా ఒకటి. అటు కామెడీ పరంగానూ ఇటు ఎమోషన్స్ పరంగానూ అల్లరి నరేష్ మెప్పిస్తాడు. ఆషిక రంగనాథ్ చూడటానికి క్యూట్ గా ఉంది. నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. నాగ్, ఆషిక మధ్య లవ్ ట్రాక్ కూడా బాగుంది.
రాజ్ తరుణ్, ,మిర్ణా మీనన్, రుక్సార్ దిల్లోన్ తమ తమ పాత్రల్లో బాగానే చేసారు. మెయిన్ విలన్ గా చేసిన షబ్బీర్ కూడా ఆకట్టుకున్నాడు. నాజర్, రావు రమేష్ తమకు అలవాటైన పాత్రల్లో చేసుకుంటూ వెళ్లిపోయారు.
సాంకేతిక నిపుణులు:
ఈ చిత్ర కథలో పెద్దగా కొత్తదనమంటూ ఏం లేదు. స్నేహం, ప్రేమ, ఊరి సమస్య… ఇలానే సాగుతుంది ఈ చిత్రం కూడా. మరోవైపు స్క్రీన్ ప్లే కూడా అంత కొత్తగా ఏం ఉండదు. రొటీన్ టెంప్లేట్ లోనే సాగుతుంది. ప్రసన్నకుమార్ సంభాషణల్లో కూడా అంతగా మెరుపేమ్ లేవు. అలా అలా సాగిపోతుంది.
అన్నీ సాధారణంగానే ఉన్నా కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ, చిత్రాన్ని ప్రెజంట్ చేసిన తీరు మెప్పిస్తుంది. యాక్షన్ సీన్స్, రిచ్ నెస్ కూడా ఆకట్టుకుంటాయి. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ఒకటి. కొన్ని సీన్స్ ను కీరవాణి అమాంతం పైకి లేపాడు. పాటలు కూడా ఇంప్రెసివ్ గానే సాగుతాయి. ఇక సినిమాటోగ్రఫీ సూపర్బ్ అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా నీట్ గానే సాగింది. నిర్మాణ విలువలు కూడా ఓకే.
ప్లస్ పాయింట్స్:
- నాగార్జున, అల్లరి నరేష్, ఆషిక రంగనాథ్ పెర్ఫార్మన్స్
- ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- రొమాంటిక్ పోర్షన్స్
మైనస్ పాయింట్స్:
- కొత్తదనం లేకపోవడం
చివరిగా:
నా సామి రంగ యావరేజ్ గా సాగే విలేజ్ ఎంటర్టైనర్. కథలో కొత్తదనం లేకపోయినా కామెడీ, యాక్షన్, రొమాన్స్, పండగ వాతావరణం.. సినిమాను వర్కౌట్ అయ్యేలా చేస్తాయి. ఫ్యామిలీస్ ఈ పెద్ద పండక్కి చూడటానికి బెస్ట్ ఆప్షన్ నా సామి రంగ.