వైసీపీ పాలనలో పోలీసులు పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైపోయిందనే చర్చ ఇటీవల తరచూ జరుగుతోంది మీడియా, రాజకీయ వర్గాల్లో. అధికార పార్టీ నేతలు అత్యంత జుగుప్సాకరమైన రీతిలో పోలీసు అధికారులపై విరుచుకుపడుతున్నారు.
ఆ మధ్య ఓ మహిళా ఎమ్మెల్యే, తమ అనుచరులకు సంబంధించిన ఇసుక అక్రమ రవాణా వ్యవహారంపై పోలీసు అధికారి ఒకరు ఉక్కుపాదం మోపితే జీర్ణించుకోలేకపోయారు. ఫోన్ చేసి చెడామడా తిట్టేశారు. అది వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో.. అందునా రాజధాని పరిధిలోనే జరిగిన వ్యవహారం. పేకాట శిబిరాల వ్యవహారంలోనూ సదరు ఎమ్మెల్యే ఇలాగే పోలీసులతో పంచాయితీ పెట్టుకున్నారు.
మొన్నీమధ్యనే ఓ మంత్రిగారు, పోలీసు అధికారి ఒకరిపై విశాఖలో విరుచుకుపడ్డ వైనం ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేవు. ఇలాంటివి గడచిన మూడేళ్ళలో చాలానే జరిగాయి.. ఆ మాటకొస్తే, అంతకు ముందు కూడా జరిగాయనుకోండి.. అది వేరే సంగతి.
తాజాగా మంత్రి పేర్ని నాని, తన వాహనాన్ని పోలీసులు వేరే చోట పార్క్ చేయమని కోరితే, సదరు పోలీసులపై విరుచుకుపడిపోయారు. మంత్రిగారి డ్రైవర్.. పోలీసులు ఆ వాహనాన్ని వేరే చోటకి తీసుకెళ్ళమని కోరడం గురించి మంత్రిగారికి విన్నవిస్తే.. అగ్గిమీద గుగ్గిలమైపోతూ, పోలీసుల్ని చెడామడా వాయించేశారు మాటలతో.
‘పండగ అప్పుడే అయిపోయిందనుకోవద్దు.. నేను ఇన్‌ఛార్జి మంత్రిని.. ఎస్పీ, డీఐజీ కార్లు ఎందుకున్నాయ్.. నాకంటే వాళ్ళ ఎన్ని డిజిగ్నేషన్లు తక్కువ.?’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు మంత్రి పేర్ని నాని.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపైనా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదా విరుచుకుపడ్డంలో మంత్రి పేర్ని నాని సిద్ధహస్తుడే! ఆ విషయాన్ని అంతా గుర్తించారుగానీ, ఏ గుర్తింపు కోసమో ఇలా తాను ప్రభుత్వంలో బాధ్యతగల మంత్రిగా వున్నానన్న విషయాన్ని మర్చిపోయి, పోలీసు అధికారులపై నోరు పారేసుకోవడమేంటి.?
ఇంతకీ, పోలీసు అధికారుల సంఘమంటూ ఒకటుంది కదా.. ఆ సంఘం తరఫున ఎవరైనా మంత్రిగార్ని ఈ విషయమై నిలదీస్తారంటారా.?