ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 52 సంవత్సరాలు. ప్రస్తుతం థాయిలాండ్ లో ఉన్న వార్న్ తానున్న గదిలో అచేతనంగా పడి ఉండటం గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన గుండెపోటుతో మరణించారని వైద్యులు ప్రాధమికంగా నిర్ణయించారు.
ఆస్ట్రేలియా తరపున 1992లో క్రికెట్ లో ఎంటరైన వార్న్ 2007లో రిటైరయ్యారు. మొత్తం 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 37సార్లు 5 వికెట్లు, 10సార్లు 10 వికెట్లు తీసిన ఘనత వార్న్ సొంతం. ప్రపంచ క్రికెట్లో ముత్తయ్య మురళీధరన్ (800) తర్వాత.. అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్ తొలి సీజన్లోనే తాను ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
స్పిన్ దిగ్గజంగా ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని ఎంతో అలరించిన వార్న్ హఠాన్మరణం క్రికెట్ అభిమానులను బాధించేదే. 1993లో యాషెస్ సిరీస్ లో మైక్ గ్యాటింగ్ ను తన అద్భుతమైన స్పిన్ తో బౌల్డ్ చేసిన తీరుతో వార్న్ పేరు మారుమ్రోగిపోయింది. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా చరిత్రలో నిలిచిపోయింది. వార్న్ మృతి పట్ల క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు ఆయన అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో మెసెజెస్ చేస్తున్నారు.