ఇంజనీరింగ్ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? చక్కగా ఆ జాబ్ చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేస్తారు. కానీ రాజస్థాన్ కి చెందిన హరీశ్ ధన్ దేవ్ మాత్రం అలా కాదు. ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, ఆయన సంతృప్తి చెందలేదు. రెండు నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం వ్యవసాయంలోకి దిగారు. అంతే అంచలంచెలుగా ఎదిగి కోట్లకు పడగలెత్తారు.
జైసల్మేర్ కి చెందిన ధన్ దేవ్.. 2012లో జైపూర్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తర్వాత ఢిల్లీలో ఎంబీఏలో చేరారు. ఎంబీఏ చదువుతుండగానే జైసల్మేర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో ఎంబీఏకి పుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరారు. అయితే, ఆ ఉద్యోగం ఆయనకు ఎలాంటి ఆనందం ఇవ్వలేకపోయింది. దీంతో రెండు నెలలకే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకు ఉన్న 120 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సన్నిహితులంతా ధన్ దేవ్ ను తిట్టారు. నిక్షేపం లాంటి ఉద్యోగం వదులుకుని, నష్టాలొచ్చే వ్యవసాయం చేస్తావా అని ప్రశ్నించారు. కానీ ఇవేమీ ఆయన పట్టించుకోలేదు.
ఈ క్రమంలో బికనీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ను కలవడం హరీశ్ జీవితంలో మలుపు తిరగడానికి కారణమైంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఏ పంట పండిస్తే బావుంటుందో చెప్పాలని హరీశ్ అడగ్గా.. ఆయన ఆలోవెరా మొక్కల గురించి వివరించి, ఆ పంట సాగు చేయమని సూచించాడు. దీంతో హరీశ్ ఆలోవెరా పంటను ఆధునిక పద్ధతులతో ఎలా సేద్యం చేయాలో తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి 25వేల ఆలోవెరా మొక్కలను తీసుకొచ్చి తన భూమిలో సేద్యం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఇతర రైతులు హరీశ్ ను హెచ్చరించారు. ఆలోవెరా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, తాము గతంలో ఆ పంట పండించి నష్టపోయిన విషయాన్ని వివరించారు. అయితే, సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్లే ఆ రైతులు నష్టపోయిన విషయాన్ని హరీశ్ గుర్తించారు. దీంతో తన మార్కెటింగ్ వ్యూహాలతో దానిని అధిగమించాలని భావించారు.
అనంతరం జైపూర్ లోని కొన్ని ఏజెన్సీలను సంప్రదించి, ఆలోవెరా ఆకులను వారికి అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఆలోవెరా ఆకుల కంటే దాని రసానికే ఎక్కువ డిమాండ్ ఉన్న సంగతి తెలుసుకుని, తానే సొంతంగా ఆలోవెరా ఆకుల నుంచి పల్ప్ తీసి, మార్కెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన మార్కెటింగ్ ను మరింత విస్తరించాలని నిర్ణయించుకుని అందుకు మార్గాలు అన్వేషించారు.
పెద్ద పరిమాణంలో ఆలోవెరా పల్ప్ ఎవరికి అవసరం అని ఆరా తీయగా.. బాబా రాందేవ్ కు చెందిన పతంజలి కంపెనీయే పెద్ద మొత్తంలో ఆలోవెరా సేకరిస్తోందని హరీశ్ తెలుసుకున్నారు. వారిని సంప్రదించి, ఆలోవెరా పల్ప్ సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘నేచురెలో ఆగ్రో’ అనే కంపెనీ కూడా స్థాపించారు. రెండేళ్లుగా పతంజలి కంపెనీకి భారీ పరిమాణంలో ఆలోవెరా పల్ప్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం హరీశ్ ధన్ దేవ్ కంపెనీ టర్నోవర్ 3 కోట్లకు చేరింది. నాణ్యత విషయంలో తాము రాజీ పడబోమని, అదే తమను ఈ స్థాయికి తీసుకొచ్చిందని హరీశ్ గర్వంగా చెబుతారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి, వ్యవసాయం చేయడం ద్వారా కోటీశ్వరుడు కావడమే కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. హ్యాట్సాఫ్ హరీశ్.