విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఈ చిత్రంలోని తల్లి సెంటిమెంట్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. ఇన్ని ఏళ్లకు విజయ్ ఆంటోనీ ఈ చిత్ర సీక్వెల్ తో మన ముందుకు వచ్చాడు. బిచ్చగాడు 2 ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
విజయ్ గురుమూర్తి కోటీశ్వరుడు, అచ్చుగుద్దినట్లు సత్య లానే ఉంటాడు. సత్య బిచ్చగాడు. విజయ్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి విజయ్, సత్యల బ్రెయిన్ లను మార్చడానికి ప్లాన్ చేస్తారు విజయ్ స్నేహితులు. అయితే సత్యకు తన లక్ష్యాలు ఉంటాయి. విజయ్ స్నేహితులకు వాటి వల్ల ఎలాంటి చిక్కులు వచ్చాయి? ఎలా వాటిని సత్య ఎదుర్కొన్నాడు. మధ్యలో విజయ్ గురుమూర్తికి ఏమైంది?
నటీనటులు:
విజయ్ ఆంటోనీ చాలా సటిల్ గా నటిస్తుంటాడు. బిచ్చగాడులో కూడా అలా చేయడమే ప్రేక్షకులకు నచ్చింది. అయితే బిచ్చగాడు2 లో ఎమోషనల్ గా నటించాల్సిన సమయంలో విజయ్ ఆంటోనీ నటన చిత్రానికి పెద్ద మైనస్ గా మారింది. క్లైమాక్స్ లో కనుక విజయ్ ఆంటోనీ నుండి మంచి పెర్ఫార్మన్స్ వచ్చి ఉంటే ఈ చిత్ర రేంజ్ మరోలా ఉండేది.
కావ్య థాపర్ ఈ చిత్రంలో హీరోయిన్ అయినా కానీ పెద్దగా చేయడానికంటూ ఏం లేదు. అయినా కానీ ఉన్నంతలో డీసెంట్ గానే కనిపించింది. ఇక మిగతా నటీనటులు తమ పరిధుల మేరకు బాగానే చేసారు.
సాంకేతిక నిపుణులు:
బిచ్చగాడు 2 కథ మరీ కొత్తదేం కాదు. ట్రీట్మెంట్ విషయంలో కూడా నయా పంథా అవలంబించింది లేదు. బిచ్చగాడు సీక్వెల్ కాబట్టి ఎంత వేరే కథ అయినా కూడా దాంతో పోలిక రావడం సహజం. బిచ్చగాడులో కొత్తగా అనిపించింది, ఇందులో నెగటివ్ అయింది. అయితే దర్శకుడు ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకున్న మెసేజ్ ను సరిగ్గా చెప్పలేకపోయాడు అనిపిస్తే తప్పేం కాదు.
ఇక ఈ చిత్ర తెలుగు వెర్షన్ కు వచ్చిన మరో ఇబ్బంది ప్రతీ డబ్బింగ్ సినిమా ఎదుర్కొనేదే. సరైన లిప్ సింక్ లేకపోగా, తెలుగు నేటివిటీ పూర్తిగా కరువడడంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో ఎంగేజ్ కాలేరు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతాన్ని అందించాడు. అయితే పాటలు ఏవీ కూడా రిజిస్టర్ కావు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకా డీసెంట్ గా ఉండే అవకాశముంది.
సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణ విలువలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.
పాజిటివ్ పాయింట్స్;
- మొదటి గంట
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- స్క్రీన్ ప్లే
నెగటివ్ పాయింట్స్:
- ఎలివేషన్ సీన్స్
- మెసేజ్ సరిగ్గా ఇవ్వలేకపోవడం
- ఓవర్ గా అనిపించే ఫైట్స్
విశ్లేషణ:
బిచ్చగాడు టైటిల్ తో రావడంతో బిచ్చగాడు 2 పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. బిచ్చగాడు 2 ప్రామిసింగ్ గా అనిపించినా తర్వాత్తర్వాత ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లడం ఖాయం. మొదటి పార్ట్ కు ఏ మాత్రం దగ్గరగా కూడా రాలేదు ఈ సీక్వెల్
తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5